తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉన్న సంగతి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే దీని బారిన అనేక మంది పడగ..తాజాగా సీఎం క్యాంపు కార్యాలయం అయిన ప్రగతి భవన్‌ను కూడా వదల్లేదు. ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ప్రగతి భవన్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రగతి భవన్‌లోనే ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో లేనట్లుగా సమాచారం. గురువారం ఆయన ఫాంహౌస్‌లో ఉన్నట్లుగా విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకొనేలోపు ప్రగతి భవన్ పరిసరాలను శానిటైజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.