వైకాపా దిశగా కాంగ్రెస్?

jagan--soniaభవిష్యత్ లో వైకాపాను అవసరమైతే దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పార్టీ వ్యవహారాల సంస్కరణల్లో భాగంగా ఆజాద్ ను ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల నుంచి తప్పించడం చూస్తుంటే ఇలా అనుకోక తప్పదు.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో బాగా పరిచయం వున్నవారు ముగ్గురు. వీరప్ప మొయిలీ, ఆజాద్, దిగ్విజయ్ సింగ్.
ఈ ముగ్గురిలో ఆజాద్ కన్నా మిగిలిన ఇద్దరూ వైస్ కు బాగా సన్నిహితులు.పైగా ఆజాద్ తన మనసులో మాట బయటపెట్టడంలో కానీ, వ్యూహాల అమలులో కానీ చాలా గుంభనంగా ఉంటారు. దిగ్విజయ్ అలా కాదు, తనకు ఇష్టమైతే, ఎవరు ఏమనుకుంటారన్నది చూడకుండా ముందుకు అడుగేస్తారు. కెవిపికి దిగ్విజయ్ కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని రాజకీయవర్గాలు చెబుతుంటాయి. ఇక ఎన్నికలు ఎంతో దూరంళో లేని సమయంలో ఉన్నట్లుండి అజాద్ స్థానంలో దిగ్విజయ్ ను నియమించడం అంటే, భవిష్యత్ లో అవసరమైతే వైఎస్ కుటుంబంతో పొత్తు యత్నాలకు శ్రీకారం చుట్టినట్లేనని భావించవచ్చు.

ఇటీవల రాహుల్ దూతలు రాష్ట్రంలో సర్వేలు చేసినప్పుడు కూడా వైకాపా సంగతి ప్రశ్నించకపోవడాన్ని ఇక్కడ గుర్తు
చేసుకోవచ్చు. మరోపక్క జగన్ ను వేటాడమే లక్ష్యం అన్నంతగా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్లిపోయారు. నిజానికి ఆయన తన బదిలీ ఆగుతుందని కాస్త భావించినట్లు తెలుస్తోంది. అందుకే చివరిదాకా ఆయన తన బదిలీపై పెదవి విప్పలేదు. విశాఖలో మాట్లాడుతూ కూడా తనకు ఇంకా ఏ ఆదేశాలు రాలేదని అన్నారు. కానీ ఈ విషయంలో కేంద్రం అంత సుముఖంగా లేదు. వుండి వుంటే, ఏదో ఒక మిషతో ఆపడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి కొత్త జెడి కూడా చాలా సిన్సియర్ అన్న పేరు తెచ్చుకున్నవారే. కానీ ఆయన జెడి మాదిరిగా మరీ కక్ష సాధింపు అనిపించేలా ప్రవర్తించకపోవచ్చు. వీటన్నింటిని రీత్యా జగన్ ను భవిష్యత్ అవసరాలకు వాడుకునేలా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.