వ్యూహాత్మకమేనా?

cm-kiran-dgp-dinesh-reddyపదవిలో ఉన్నంతకాలం మిన్నకుండిపోయిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఒక్కసారిగా సీఎంపై వాగ్బానాలు సందించడానికి కారణాలేమి? ఉన్నన్నాళ్లు బాగానే ఉన్న దినేష్ రెడ్డిలో ఉప్పెనలా ఉప్పొంగిన ఆవేశంతో మాట్లాడడంలో అంతరార్థం ఏమిటి? సామాన్యుని నుంచి రాజకీయ నాయకులు, మేధావుల వరకు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్నలివి..సీఎం ఎన్నో అవినీతి అక్రమాలకు ప్రోత్సహించారంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడానికి ప్రోత్సహించిందెవరు అనేది ప్రతీ రాజకీయ నాయకుడూ ఆలోచిస్తున్నారు. సీఎం పై దినేష్ విరుచుకుపడ్డ క్షణం నుంచి ప్రతిపక్షాలే కాదు, స్వపక్షమైన కాంగ్రెస్ నాయకుల నుంచి సీఎం ను సమర్థిస్తూ మాట్లాడిన వారే లేరు. అదీగాక ఒక ప్రతిపక్ష నాయకుడో, రాజకీయ విశ్లేషకుడి మాటలకు స్పందించాల్సిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ ఒక మాజీ డీజీపీ వ్యాఖ్యలకు స్పందించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైగా ధైర్యముంటే కోర్టుకు వెళ్లవచ్చంటూ దినేష్ రెడ్డికి ఉచిత సలహా కూడా ఇచ్చారు. అంటే ఇదంతా కాంగ్రెస్ పెద్దలు ఆడిస్తున్న నాటకమా? ఇలాంటి వ్యాఖ్యలతో సీఎంను ప్రజల్లో చులకన చేసి అవినీతి మకిలీని అంటించి మెల్లగా పదవికి రాజీనామా చేసేలా చేయడానికి వేసిన ఎత్తుగా కూడా పలువురు రాజీకీయ విశ్లేశకులు భావిస్తున్నారు. పరిస్థితులన్నీ గమనిస్తుంటే ఇదంతా కాంగ్రెస్ పెద్దలు తెరవెనక రాజకీయం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. మరి దినేష్ రెడ్డి సీఎం వ్యవహారంపై నిజంగానే కోర్టుకు వెళతారా? ముందుముందు ఎలాంటి వ్యూహంతో సీఎంపై విరుచుకుపడతారు? నిజంగా బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేన్ని ఆధారాలు దినేష్ దగ్గర ఉన్నాయా అనేది అంతటా చర్చించుకుంటున్నారు.