ప్యాకేజీ తాయిలాలు…!

shindeవ్యూహాలలోనూ, రాజకీయ చాతుర్యంలోనూ, ప్రతిపక్షాలను సైతం తన దారిలోకి తెచ్చుకోగలిగే నేర్పు కాంగ్రెస్ పార్టీ సొంతం. కాంగ్రెస్ పార్టీ తరువాతే ఇంకేదైనా అనేలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత ఉవ్వెత్తున ఎగసిపడిన సమైక్య ఉద్యమాన్ని ఒక వ్యూహాత్మక ప్రణాళికతో విరమింపజేయడంలో సఫలమైంది ఆపార్టీ. దూకుడుగా వ్యవహరిస్తూ ధిక్కార స్వరాన్ని వినిపించిన ముఖ్యమంత్రిని సైతం తన దారిలోకి తెచ్చుకుంది. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోం అంటూ బీరాలు పలికిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తన దారికి తెచ్చుకుంది. సమైక్య రాష్ట్రం తప్ప వేరే ఏ ప్రత్యామ్నాయానికి ఒప్పుకోమన్న సమయంలో పీటీఐలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ లీకులు వదిలింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరువాత షిండే ఓ సందర్భంలో మాట్లాడుతూ విభజనపై వెనక్కు తగ్గేది లేదంటూనే సీమాంద్రకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం తప్ప ఎలాంటి ప్యాకేజీలు అవసరం లేదని అప్పటివరకు బీరాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు షిండే వ్యాఖ్యలపై ఎవరూ స్పందించలేదు. దీంతో కేంద్రం కూడా కొంతమేర ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి కేంద్రం ప్యాకేజీ తాయిలంతో సీమాంధ్ర ప్రాంతాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మరి సీమాంధ్ర రాజధాని విషయంలో ఇంకెలాంటి రాజకీయాలు చేయనుందో? అనే అనుమానం ఆ ప్రాంత రాజకీయ నాయకుల్లో చర్చలు మొదలయ్యాయి. సమైక్య ఉద్యమాన్నైతే కొంతమేర తగ్గించగలిగారే గానీ రాజధాని గొడవను తగ్గించాలంటే ఎన్ని ఎత్తులు వేస్తుందో ఈ కాంగ్రెస్…