’కాపు’ కాసేనా?

chiruకర్రకు గడ్డి కట్టి గుర్రాన్ని ఎంతదూరమైన నడిపించవచ్చు అనుకోవడం భ్రమే. గుర్రానికి అలుపు వచ్చిన తరువాత గడ్ది పెట్టినా తినే ఓపిక వుండకపోవచ్చు. కాంగ్రెస్ రాష్ర్టంలో ఇలాంటి రాజకీయానికే తెరతీసింది. చిరంజీవికి అందలం ఎక్కిస్తామన్న ఆశ చూపిస్తూ, ఆయనకు చెందిన కాపు వర్గానికి గేలం వేస్తొంది. ఎప్పుడో ఎన్నికల తరువాత చిరంజీవిని ముఖ్యమంత్రిని చేస్తారో, ఆరోజు ఎవరికి తెలియని కొత్త ముఖాన్ని దిగుమతి చేస్తరో ఎవరికి ఎరుక? కాంగ్రెస్ సంస్కృతి అలాంటిది. కానీ దాన్ని దాచిపెట్టి, చిరంజీవిని ఎగసందోసి, కాపులను దువ్వుతున్నారు.

తద్వారా ఇటు మూడు ప్రాంతాల్లో మంచి ఓట్ల శాతం సాధించవచ్చన్నది కాంగ్రెస్ ఆశగా కనిపిస్తోంది. అసలు సంగతి, కాంగ్రెస్ నైజం తెలియని చిరంజీవి కూడా తన అనుచర వర్గంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే కేవలం చిరంజీవికి పదవి ఇస్తే సరిపోదని, అంతమాత్రం చేత కాపులు గంప గుత్తగా కాంగ్రెస్ కు ఓత్లు వేయరని ఆ కుల నేతలకు తెలుసు. అందుకే వారు కాపులను బిసిల్లోకి చేర్చే వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు.

ఎన్నికల మానిఫెస్టోలో కనుక ఈ హామిని చేర్పించగలిగితే, కాపు నాయకులంతా తమ భుజాలు చరచుకుంటూ, జనం దగ్గరకు వెళ్లగల పరిస్థితి వుంటుంది. కానీ కాంగ్రెస్ మానిఫెస్ట్ సంగతి నాయకులకు, జనాలకు కొత్త కాదు. అందులో అంశాలు అన్నీ నెరవేరుతాయనుకుంటే డౌటే. తెలంగాణను గత ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి, ఈ ఎన్నికల దాకా ఈడ్చగలిగిన చాతుర్యం ఆ పార్టీది. మరి ఇది కూడా అంతే కాదని గ్యారంటీ ఏమిటి? అయితే ఈ సమస్య ప్రజలది. నాయకులకు అధికారం అంది వస్తే చాలు కదా?