Site icon TeluguMirchi.com

కాంగ్రెస్ కామెడీ కమిటీ పార్ట్ 2

soniaరాష్ట్ర విభజన విషయంలో చాలా మంది అనుమానాలను, ఆశలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి శనివారం నాడు తన మనసులో మాట బయటపెట్టారు. ఆంటోని కమిటి కాంగ్రెస్ పార్టీ కమిటీ అనీ, దానికి చట్టబద్ధత లేదని, అలాంటప్పుడు ఆ కమిటీ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేదనీ అంటూ సీమాంధ్ర నేతలు గగ్గోలు పెట్టేస్తున్న నేపధ్యంలో సోనియాగాంధి నిన్న డిల్లీలో జరిగిన జాతీయ మీడియా సంస్థ ప్రారంభోత్సవ సభలో ఈ విషయమై మరో కొత్త ప్రహసనానికి తెరలేపారు. ఆంటోని పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా కేంద్రప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుందని, సీమాంధ్రులు తమ సలహాలను, సూచనలను, అభ్యంతరాలను ఆ కమిటీకి నివేదించవచ్చని ఆమె వెల్లడించారు. ఇది కేవలం సీమంద్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలను వినేందుకుమాత్రమే అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చారు. అంటే పరోక్షంగా ఈ కమిటీ కి రాష్ట్ర విభజనకు సంబంధమే లేదని ఆమె ఖండితంగా చెప్పారు. ఆంటోని కమిటీ నియామకసందర్భంలో కూడా దిగ్విజయ్ సింగ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సో….. రాష్ట్రాన్ని రెండుగా విభజించే విషయంలో సోనియా గాంధి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా చెప్పేస్తోంది. ఈ విషయాన్ని ఆమె తనను రోజూ కలుస్తున్న సీమాంధ్ర కేంద్రమంత్రులకు, ఎం పి లకు పదే పదే కుండబద్దలు కొట్టి చెబుతున్నట్లు తెలుస్తోంది. అయినా ఆ విషయాన్ని బైటపెడితే తమ కొంపలు ఎక్కడ కొల్లేరు అవుతాయో అని భయపడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version