‘ఎవరెలాపొతే మాకేంటి’ : కాంగ్రెస్

digvijay-singh-sonia-gandhiరాష్ట్రవిభజన విషయంలో ఆంద్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, ఎం.పి. లు అధిష్టానం ముందు పదే పదే చేస్తున్న వాదనలను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ” మీరు ఎన్నయినాచెప్పుకోండి. మా నిర్ణయం మాదే. వెనుదిరిగే ప్రసక్తేలేదు. ” అంటూ పార్టీ పెద్దలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అటు డిల్లీ లోనూ ఉండలేక, ఇటు స్వంత నియోజకవర్గాలకు రాలేక వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. చివరికి దింపుడు కళ్ళెం ఆశ లాగా మంగళవారం నాడు చివరిసారిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో సహా ఈ నాయకులందరూ అధిష్టానం ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

” హస్తిన లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటం సబబు కాదు. సీమాంధ్ర ప్రాంతంలో కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ప్రజా ఉద్యమం చూడండి. పిల్లా జెల్లా చిన్నా పెద్దా ముసలీ ముతకా తేడా లేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి ఉద్యమాన్ని దేశం ఇంతవరకు చూడలేదు. మా పరిస్థితి దారుణంగా తయారైంది. మా మీద మాకే జాలేస్తోంది. మా నియోజక వర్గాలకు వెళ్ళలేకపోతున్నాం. మమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ఆ ప్రాంతం అలా అగ్నిగుండంలా మండిపోతుంటే మరో పక్క కేంద్రమంత్రి షిండే ” మరో ఇరవై రోజుల్లో తెలంగాణా పై కేబినేట్ నోట్ ప్రవేశ పెడుతున్నాం ” అంటూ పుండు మీద కారం చల్లారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ఉద్యమం మరింత ఉధృతం కావటం మాత్రమే కాక ఉద్యమ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి నీచాతినీచంగా తయారవుతోంది. ఈ పరిస్థితిని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్ధులు, మహిళలు, కూలీలు, వ్యాపారస్థులు,ఉపాధ్యాయులు, వైద్యులు, లాయర్లు…. ఇలా అన్ని వర్గాలు లక్షల సంఖ్యలో ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహోద్యమం. దీనిని తక్కువగా పరిగణించొద్దు. తేలికగా తీసుకోవద్దు. పరిస్థితిని అధ్యనం చేయండి. ఉద్యమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను, వేదనను అర్ధం చేసుకోండి. వారిని శాంతపరచండి. వారికి భరోసా ఇవ్వండి. భద్రత కల్పించండి.లేకుంటే మేము పార్టీలో మాత్రమే కాదు… రాజకీయాలలో కొనసాగటం కూడా కష్టమే “

ఇదీ మంగళవారం నాడు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చేసుకున్న వాదన… వేదన… రోదన… ఆవేదన…. మరి దీనికి అధిష్టానం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.