2014 రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార సారధిగా చిరంజీవి !

chiru2014 లో పార్లమెంటు కు, అసెంబ్లీ కి జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రమంత్రి చిరంజీవి ప్రధాన ప్రచార సారధిగా వ్యవహరించబోతున్నారన్న వార్త ప్రస్తుతం రాజ్యమేలుతోంది. పార్టీ లో జనాకర్షణ వున్న ఏకైక నాయకుడిగా చిరంజీవి కె ఈ బాధ్యత వప్పగించేందుకు అధిష్టానం సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కూడా చిరంజీవి ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. పక్క రాష్ట్రంలోనే చిరంజీవి అంతటి ప్రభావం చూపించగలిగితే స్వంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మరింత ప్రభావం చూపగలరని అధిష్టానం నమ్ముతోంది. కేంద్ర టూరిజం మంత్రి గా చురుకైన పాత్ర పోషిస్తూ, గతంలో ఏ మంత్రీ చేపట్టనన్ని కార్యక్రమాలు చేపడుతున్న చిరంజీవి సహజంగానే అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాష్ట్రంలో ముక్కుతూ మూలుగుతూ వున్న కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికలలో ఒక్క చిరంజీవి మాత్రమే గట్టేక్కించగలరన్న ప్రగాఢ విశ్వాసంతో వున్న అధిష్టానం రాబోయే ఎన్నికల ప్రచార బాధ్యతను ఆయనకే వప్పగించాలన్న నిర్ణయం గైకోన్నట్టు తెలిసింది. అయితే ఈ నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్ కూ, పి సి సి అధ్యక్షుడు బొత్స కూ ఎంతవరకు జీర్ణమవుతుందో చూడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించేంత సీను చిరంజీవి కి వుంటే ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిన అవసరం ఏముంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.