‘ఉత్త’ర కుమారుడేనా?

CM-Kiranమునుపెన్నడూ లేని విధంగా ఇప్పడు రాష్ట్రంలో పరిస్థితులున్నాయి.సమ్మెలతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఇలాంటి సమయంలో పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఉంటుంది. రోజురోజుకీ అంధకారంలో చిక్కుకుంటున్న రాష్ట్రానికి వెలుగు కిరణమై ప్రకాశించాల్సిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మిన్నకుండిపోతున్నారు. మాట్లాడాల్సిన సందర్భాల్లో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ప్రకటన, కేబినెట్ నోట్ ఆమోదం ఇలా ఒకదాని వెనక ఒకటి జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు సీఎం. అయితే కాంగ్రెస్ పెద్దల మాటలను పెడచెవిన పెట్టడమే కాదు రాష్ట్ర పాలనను కూడా కిరణ్ గాలికొదిలేసారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రమంతా అట్టుడుకుతుంటే సమ్మెనివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి మిన్నకుండిపోతున్నారు. సమ్మె ప్రారంభంలోనే ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యను సావధానంగా పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితులు చేయిదాటి పోయాక చర్చలు జరిపారు. దీంతో ఉద్యోగులతో జరిపిన చర్చలు విపలమయ్యాయి. అధిష్టానంపై తిరుగుబావుటాను ఎగరేసిన కిరణ్ అటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పెద్దలను ఎదిరించనూ లేదు ఇటు రాష్ట్ర పాలనను కూడా సజావుగా సాగించింది లేదు. పోనీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారా అంటే అదీ లేదు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే ప్రాంతీయ వాదాన్ని వినిపించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్. అది కూడా ఒక బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఒకవాదాన్ని వినిపించడం సరికాదనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని చెబుతూ వస్తున్న సీఎం వ్యాఖ్యల్ని ఆయన అనుచరగనమే నమ్మడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.సీఎం అనుకూల వర్గమైన కొందరు మంత్రులు కూడా ఆయన వాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తం మీద సీఎం వ్యవహారమంతా పరిశీలిస్తే అటు ఉట్టికి ఇటు స్వర్గానికి ఎగరలేని పరిస్థితిలా కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ సీఎం మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలేనా. ఉయన ఉత్త కిరణ్ కుమారేనా? జరిగేదంతా చూస్తోంటే అలాగే అనిపిస్తుంది మరి.