డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు నా సూచన. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీ వంతు బాధ్యత వహించడం లేదని మా ప్రభుత్వం భావిస్తోంది.
నేను మా అధికారులకు ఒక సూచన చేస్తున్నా. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వీడియోలు చేయాలి. మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్‌తో ఆ వీడియో రూపొందించాలి. ఇది గౌరవనీయమైన డిమాండ్. వ్యక్తుల స్థాయితో సంబంధం లేకుండా వారు వీడియోలు చేస్తే మాత్రమే టిక్కెట్ రేట్ల పెంపునకు సమ్మతి లభిస్తుంది. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి. అది వాళ్ల బాధ్యత. సినిమా నిర్మాణం అనేది వ్యాపారం. కానీ, సామాజిక బాధ్యత కూడా అవసరం.
డ్రగ్స్, సైబర్ క్రైమ్ లను నియంత్రించకపోతే సమాజం నిర్వీర్యమవుతుంది. ఈ సమాజాన్ని కాపాడటానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ఇదొక్కటే మా కండీషన్. సినిమా షూటింగ్‌ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్‌శాఖను కోరుతున్నా. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు