టి బిల్లును వ్యతిరేకించిన కిరణ్ !

cm kiranరాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నా తాను వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాసనసభలో ఈ సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై ప్రసంగించారు.

తాను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తనను ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ చేసినా… తాను ఎందుకు అధిష్ఠానాన్ని వ్యతిరేకిస్తున్నానో చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తనను ముఖ్యమంత్రిగా చేసిన సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని ఆయన తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీ కావాలా, లేక సమైక్య రాష్ట్రం కావాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన క్లిష్ట పరీక్ష ఎదురయ్యిందని కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం ఫ్లోర్ లీడర్ గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? లేక ఆయన చెబుతున్న అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమా అంటూ టీఆర్ఎస్ నేతలు వెల్ లోకి దూసుకొచ్చి సీఎం వ్యతిరేక నినాదాలు చేశారు.

బిల్లును వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతుండగా ప్రసంగాన్ని జానారెడ్డి అడ్డుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కిరణ్ వ్యక్తిగతంగా చెప్పారా? లేక సభానాయకుడిగా చెప్పారా? అని మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు.

శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగం సందర్భంగా నెలకొన్న గందరగోళంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి సభాధ్యక్షుడి స్థాయిలో మాట్లాడుతారని అందులో ఎవరికైనా ఎందుకు సందేహం వస్తోందో తమకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. వివాదం కాని విషయాన్ని వివాదం చేయాలనుకోవడం సరైన సంప్రదాయం కాదని ఆనం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సమయం సరిపడేంత సమయం లేదని, ముఖ్యమంత్రికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని ఆనం సూచించారు.

అనంతరం కిరణ్ మాట్లాడుతూ… తాను ఇంకా చాలా మాట్లాడాల్సి ఉందని అన్నారు. టీఆర్ఎస్ కు చరిత్ర లేదని, తమ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందని, దానిని తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముందుగా చరిత్రను మాట్లాడుతాను, జరిగిన అభివృద్ధి, వాస్తవాలు, వక్రీకరణలు అన్నీ మాట్లాడతానని అన్నారు.