దూకుడుకు కళ్లెం పడిందా?

cm kiranరాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పార్టీకి విధేయుడిగా ఉన్న సీఎం కిరణ్ సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం అధిష్టానాన్నీ ధిక్కరించాడు. సీమాంధ్ర లో సమ్మెకు మద్దతు తెలిపారు.నిన్నమొన్నటి వరకు ఎంతో దూకుడుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కిరణ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడానికి కారణాలేంటి? అధిష్టానం కిరణ్ దూకుడుకు కళ్లెం వేసిందా? పరిస్థితులన్నీ గమనిస్తుంటే అలాగే అనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విభజన నిర్ణయం తీసుకున్న దగ్గరనుంచీ తన వాణిని గట్టిగా వినిపించిన ముఖ్యమంత్రి మెల్లమెల్లగా తన స్పీడ్ తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ శ్రేణులతో పాటు తన వర్గీయుల నుంచి కూడా కిరణ్ తీరుపై విమర్శలు వచ్చాయి. ఒక దశలో అందరి వ్యతిరేకతను మూటగట్టుకుని ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంతేకాకుండా అధిష్టాన పెద్దలు కూడా సీఎం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సీఎం మార్పు తథ్యం అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని త్వరగా చక్కదిద్దకపోతే ఖచ్చితంగా సీఎం మార్పు జరుగుతుందన్న సంకేతాలు కూడా అధిష్టాన వర్గం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని సీఎం కిరణ్ పైకి అస్త్రంగా ఉపయోగించుకుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. మొత్తం మీద నయానో భయానో సీఎంపై ఒత్తడి పెంచి ఆయన దూకుడుకు కళ్లెం వేసినట్టు కనిపిస్తోంది అధిష్టానం. అందుకేనేమో ముఖ్యమంత్రి వ్యవహారంపై సాక్ష్యాధారాలు బయటపెడతానన్న దినేష్ రెడ్డి మళ్లీ మారు మాట్లాడడం లేదు. అంతేకాదు మాటల బాణాలను వదిలే సీఎం కూడా మిన్నకుండిపోయారు. ఇంతకీ ముఖ్యమంత్రి సైలెన్స్ వ్యూహాత్మకమా? లేక అధిష్టానం వల్ల కలిగిన జ్ఞానోదయమా? ఏమో అసెంబ్లీలోకి తెలంగాణ బిల్లు వస్తేనే గానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా కనిపించడంలేదు.