చివరి బంతి పడేవరకు మ్యాచ్ ముగియదు!

cm kiranరాష్ట్ర విభజనకు సంబంధించి సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అంశం లో అధిష్టానం నిర్ణయం పై మొదటి నుంచి కాస్త ధిక్కారణ స్వరం తో మాట్లాడిన కిరణ్ మరో సారి వ్యతిరేక స్వరం వినిపించారు. చివరి బంతి పడేవరకు మ్యాచ్ ముగియదని అని తనదైన స్టైల్ లో వ్యాఖ్యానించారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని, రాజకీయాలకన్నా… రాష్ట్ర శ్రేయస్సే తనకు ముఖ్యమని అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను కేంద్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలు ప్రజాభీష్టానికి అనుకూలంగా పనిచేయాలని… ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని తెలిపారు.

ఆందోళన చేస్తున్న వారి సమస్యలను పరిష్కరించకుండా ముందుకు వెళ్లలేమని కిరణ్ కుండ బద్దలుకొట్టారు. హైదరాబాద్ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడాని వీలవుతుందని అభిప్రాయపడ్డారు. నదీ జలాల పంపకం అంత ఈజీగా జరగదని… ఇప్పటివరకు ఏ రెండు రాష్ట్రాలకు నదీ జలాలను సమానంగా పంచలేకపోయారని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ చివర్లో నేను సమైక్యాంద్ర కు సిఎంనని వివరణ ఇచ్చారు.