Site icon TeluguMirchi.com

సీఎం విందు రాజకీయం

kirankumarరాష్ట్ర విభజన నేపథ్యంలో.. సీమాంధ్ర, తెలంగాణ మంత్రుల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు తెలంగాణ మంత్రులు. హైదరాబాద్ లో ఏపీ ఎన్జీవోల సభ నిర్వహించిన అనంతరం తెలంగాణ మంత్రులు మరింత స్పీడ్ పెంచారు. సీఎంపై సూటిగా విమర్శానాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. ? సీమాంధ్రకు మాత్రమేనా.. ? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ ఎపీ ఎన్జీవోల సభ కాదు.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభ అని టీ-నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సీమాంధ్ర, తెలంగాణ మంత్రుల గురించి చెప్పనక్కర్లేదు.. ఒకవైపు విభజనను అడ్డుకుంటామంటే.. మరోవైపు ఆపలేరని ఒకరిమీద ఒకరు కౌంటర్లు వేసుకుంటూ.. ఒకపార్టీకి చెందిన నేతలే పాలక-ప్రతిపక్ష నేతల్లా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రి కోటగిరిలోని తెలంగాణ మంత్రులు కూడా సూటీగా సీఎం కిరణ్ పై చురకలేస్తున్నారు. ఇదిలానే కొనసాగితే లాభం లేదనుకున్నారేమో సీఎం.. సీమాంధ్ర, తెలంగాణ మంత్రులను రేపు విందుకు ఆహ్వానించారు.ఇరు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకే ముఖ్యమంత్రి ఈ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం. సీమాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణే సారధ్యం వహిస్తారని, సమైక్య పేరిట సీఎం కొత్త పార్టీ పెట్టబోతున్నారని, సమైక్య కు మద్దతుగా సీఎం పాదయాత్ర చేయబోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. రోజు రోజుకు ముఖ్యమంత్రి పట్ల టీ-కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు సహకరించాల్సిందేనని ముఖ్యమంత్రిని టీ-మంత్రులు కోరుతున్నారు. విందు పేరిట ముఖ్యమంత్రి నేతల మధ్య నెలకొన్న విభజన రాజకీయాన్నికాస్త తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వున్న అధినేత్రి సోనియా గాంధీ కూడా రేపోమాపో తిరిగి రానుంది. రాష్ట్ర పరిస్థితిపై మరోసారి అదినేత్రి ఆరా తీసే లోపు మంత్రుల మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించాలనేదే సీఎం ప్లాన్ లా వుంది. అలా చేస్తే ఈ సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్ కు అధిష్టానం దగ్గర మరోసారి సమైక్యం కోసం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా దొరుకుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగి విభజనను కొన్ని రోజులైనా సాగదీయగలిగితే సీమాంధ్రలో సూపర్ మైలేజ్ సాధించవచ్చు, అధిష్టానం ఆదేశమని తెలంగాణలో కూడా లాక్కురావచ్చనేది సీఎం అభిమతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి విందు రాజకీయం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version