పోడుభూములపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఇదే చివరి పంపిణీ


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల వ్యవహారంపై మాట్లాడారు. ఇక్కడ అందరికి గిరిజనుల గురించి మాట్లాడడం తేలిగ్గా, తమషాగా ఉంటుంది. పోడు భూములు గిరిజనుల హక్కులా మాట్లాడుతున్నారు.. హక్కు కాదు అది దురాక్రమణ అని అన్నారు. అడవి బిడ్డలు అయితే.. అడవిని నరికేస్తూ పోతారా ? గతంలో ఉన్న ప్రభుత్వం సరైన పంథాలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇది పెద్ద సమస్యగా మారింది. మాట్లాడితే కొందరిని వెంటేసుకొని జెండాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తూ హీరోలుగా ప్రవర్తిస్తున్నారు. ‘గిరిజనులు అడవి బిడ్డలు. వారి హక్కులను కాపాడాల్సిందే. వారిపై ఎవరూ దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. కానీ, రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? కనుమరుగ కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమయ్యాయో చూస్తూనే వున్నాం. మనం ప్రయాణం చేసే నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో ఎలాంటి సినిమాలు షూటింగ్‌లు జరుగుతుండెనే.. మన అందరి కండ్ల ముందే ఇప్పుడు ఎలా ఎడారి అయ్యిందో చూశాం. మళ్లీ అడవిని సృష్టించేందుకు రాష్ట్రం అద్భుతమైన కృషి చేస్తుంది. పోడు వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండాలా? దీనికి ముగింపు రావాలా? అని ప్రశ్నించారు. పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది. గిరిజనులకు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తప్పకుండా పట్టాలు ఇస్తాం. సర్వేలు పూర్తయ్యాయి అని చెప్పారు. అంతేకాదు మళ్లీ అటవీ భూములను ధ్వంసం చేస్తే పట్టాలు వెనక్కి తీసుకుంటామన్నారు. పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా భూమి, భుక్తి లేకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామని సీఎం చెప్పారు.

అటవీ భూములు గిరిజనులకు ఇప్పుడే ఇవ్వం. సర్పంచ్‌ స్థాయి నుంచి ఎంపీటీసీ, గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష రాజకీయ నేతలు సంతకాలు చేసి.. ఇక అడవుల నరికివేత ఉండదని ఒప్పుకుంటే ఈ 11లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు. ఇక వున్నవి కాకుండా కొత్తగా పోడు చేస్తామంటే పట్టాలు ఇవ్వమని స్పష్టం చేశారు. ‘కొందరు పనిగట్టుకొని ఛత్తీస్‌గఢ్‌ నుంచి గుత్తికోయలను తీసుకువచ్చి రాత్రికి రాత్రి అడవులను నరికివేయిస్తున్నారు. వారంతా దుర్మార్గంగా అటవీ అధికారులపై దాడులు చేస్తున్నారు. అటవీ అధికారి శ్రీనివాసరావును ఎవరు చంపారు?.. దీన్ని సమర్థిస్తామా?. గిరిజనుల డిమాండ్‌ చట్టవ్యతిరేకం. ప్రభుత్వం దయతలచి ఇస్తే తీసుకోవాలి అంతేకాని ఇలా చేయకూడదన్నారు. సర్వే చేయబడ్డ 11లక్షల ఎకరాల పోడు భూములు అందరి సమక్షంలోనే పంచిపెడుతాం. ఫిబ్రవరి చివరి వారంలో పంపిణీ చేస్తాం. ఓట్ల కోసం మాటలు చెప్పం. ఫిబ్రవరి నెలాఖరులో పోడు భూముల పంపిణీని ప్రారంభిస్తాం. పోడు భూములకు రైతుబంధు, ఉచిత కరెంటు ఇస్తాం. కానీ, పోడు భూములు తీసుకునే గిరిజనులే.. అటవీ భూములను కాపాడే కాపలాదారులు కావాలి. వారి నుంచి రాతపూర్వకంగా తీసుకుంటాం. అడవులను నరికివేస్తే పట్టాలను రద్దు చేస్తాం’ అన్నారు.

ఇకపై గజం అటవీ భూములను ఆక్రమించడానికి వీల్లేదు. పట్టాల పంపిణీ తర్వాత ‘పోడు భూములు అనేవి ఉండవు.. పంపిణీ ఉండదు’. ఇదే చివరి పంపిణి. ఇక ఇంచు ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటూం. అటవీ ప్రాంతానికి సంబంధించి హద్దులు నిర్ణయించి సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తాం. చెట్లను నరకకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కొందరు అగ్ర కులాలకు చెందిన వారు గిరిజన అమ్మాయిలని పెళ్లి చేసుకుని అటవీ భూములను ఆక్రమిస్తున్నారన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక ఇంతటితో పోడు భూముల వ్యవహారానికి ముగింపు పలకాలని సీఎం కేసీఆర్ సభాముఖంగా స్పష్టం చేశారు.