ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

సీఎం జగన్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్న ఓ మహిళ బుధవారం కొత్త సెల్‌ఫోన్‌ అందుకుంది. సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు జగన్‌తో సెల్ఫీ దిగేందుకు ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో తూకివాకం విజయ సెల్‌ఫోన్‌ జారి కాలువలో పడిపోయింది.

ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ‘పెద్దమ్మా, మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది. బాధపడవద్దు’ అని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష కొత్త సెల్‌ఫోన్‌ను డాక్టర్‌ రవికాంత్‌ ద్వారా ఆమెకు అందజేశారు. ‘నన్ను ఓదార్చడానికి జగన్‌బాబు అలా చెప్పారనుకున్నా. గుర్తుపెట్టుకొని నిజంగా సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదు’ అంటూ విజయ సంతోషం వ్యక్తం చేసింది.