రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్ తెలిపారు. కృష్ణా,గుంటూరు,నెల్లూరు నుంచి బద్వేల్ వైపుకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలను దారి మళ్లించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడున్నర గంటల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.
నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఇతర జిల్లాలకు వెళ్లే లారీలు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లాకు వెళ్లేవారు రాజంపేట, చిట్వేల్ మీదుగా వెళ్లవచ్చన్నారు.
కృష్ణా, గుంటూరు, ఒంగోలుకు వెళ్లేవారు పోరుమామిళ్ల మీదుగా ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు. నెల్లూరు వెళ్లాలనుకునేవారు, నెల్లూరు వైపు నుంచి బద్దేల్ కు రావాలనుకునే వాహనదారులు శ్రీనివాసపురం, గోపవరం, లింగసముద్రం, బేతాయపల్లి, బెడుసుపల్లి, పి.పి.కుంట మీదుగా నెల్లూరు వెళ్లవచ్చన్నారు.