మూలిగే నక్కమీద తాటిపండు

Chiranjeevi

అసలే ముసలినక్క… ఆ పైన మండుటెండ…తిండి లేదు. ఓ వైపున ఆకలి.. మరో వైపు దాహం..  నీడ లేకపోతే పోయే… పోనీ చెట్టు దాపునైనా కాస్తంత రిలాక్స్ అవుదామని… ముక్కుతూ, మూలుగుతూ…వెళ్ళి ఓ తాటిచెట్టు కింద పడుక్కుంది పాపం. అప్పటికే బాగా ఎండిపోయిన తాటిపండు సరిగ్గా దాని నెత్తి మీద ఢమామని రాలి పడింది. దెబ్బకి నక్కకి ప్రాణం పోయింది. నొప్పి తట్టుకోలేక మొర్రోమని గోల పెట్టింది. నక్క ఏడుపు ఎవడు పట్టించుకుంటాడు. దారేన పోయేవాళ్ళు దాని దురవస్థ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్రమంత్రి చిరంజీవిది ఇదే పరిస్థితి. కుల సమీకరణాల ద్వారా, తన సినీ గ్లామర్‌ ని పెట్టుబడిగాపెట్టి ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోదామని కలలు కన్న చిరంజీవికి 2009 ఎన్నికలలో ప్రజాతీర్పు గట్టి గుణపాఠం. పార్టీ టెక్కట్లులా అమ్ముకున్నారని అప్పట్టో వచ్చిన వార్తలు ఎన్నికల ముందే చిరంజీవిని నిలువునా దిగజార్చిసింది. దానికి తోడు అంతవరకూ పిఆర్‌పి పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ పార్టీ ఆఫీసులోనే ’పిఆర్‌పి’ ఒక విషపుచెట్టు అని దుమ్మెత్తిపోయడం చిరంజీవికి ర్మరో అశనిపాతం. ఎన్నికల అనంతరం తన నియోజకవర్గ ప్రజలకు కూడా కనపడకుండా దాగుడుమూతలాడితే తిరుపతిలో మహిళలు చిరంజీవి కనబడుటలేదు అని ఫ్లెక్సీలు పట్టుకుని ప్రదర్శనలు చేయడం ద్వారా చిరంజీవి ఓ కొత్త రికార్డు నెలకొల్పారు.

పార్టీని నడపలేక ఇతర పార్టీ నేతల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ ని కాంగ్రెస్‌లో తీసుకెళ్లి పాతేయడంతో తన కులవర్గాలవారిలోనే చిరంజీవి పలచబడిపోయారు. కేంద్రమంత్రి పదవి దక్కగానే బతుకుజీవుడా అని ఢిల్లీ పట్టుకుని వదలకుండా, రాష్ట్ర విభజన సమయంలో కూడా గోడమీద పిల్లిలా వ్యవహరించడంతో సీమాంద్ర ప్రజలలో పూర్తిగా డిపాజిట్లు చిరంజీవికి గల్లంతయ్యాయి. ఇదే కాకుండా సీమాంధ్ర ప్రజల తిట్లు, శాపనార్ధాలకు గురయ్యారు. అయినా చిరంజీవి వీటిన్నిటినీ కూడా చాలా లైట్‌ గా తీసుకుని చాప కిందనీరులా బండి నడుపుకుంటూ వచ్చేశారు ఇప్పటికీ సినిమా పరిభాషలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. సెంకడ్‌ హాఫ్ తెలియని ట్విస్ట్‌ తో ప్రారంభమయింది.

చిరంజీవి భారీ కమర్షియల్ చిత్రాలకు బాగా అలవాటు పడిన ఆయన అభిమానులు కూడా ఊహించలేని ఓ స్పెషల్‌ ట్విస్ట్‌. రాజకీయాలలోకి పవన్ కళ్యాణ్‌ సెన్సేషనల్‌ ఎంట్రీ. ఇటీవల సంచలనాత్మక విజయాలతో టాప్‌గేర్‌లో పరిగెడుతున్న పవన్‌ ఎంట్రీ అందరికీ ఓ షాక్‌. ముఖ్యంగా చిరంజీవికి. సినిమారంగంలో గానీ, అభిమానులకు సంబంధించి గానీ చిరంజీవితో ధాటీగా పోటీపడగలిగే సత్తాను చూపించిన ఒకే ఒక్క హీరో పవన్‌ మాత్రేమే. సినిమాల్లో పవన్‌ పవర్‌ చిరంజీవి బాగా ఎంజాయ్‌ చేసిన సందర్భాలెన్నో. ముఖ్యంగా గబ్బర్‌ సింగ్‌ విడుదలకు ముందు చిరంజీవి టోన్‌ తర్వాత టోన్‌ కీ ఎంతో తేడా ఉంది. గబ్బర్‌ సింగ్‌ విడుదలకి ముందు చిరంజీవి రాజకీయంగా కేంద్రమంత్రి స్ధాయికి ఎదిగినప్పటికీ కూడా ఆయనకి ఆద్యంతాలు అర్ధం కానీ పరిస్ధితిలో అయోమయంలో ఉన్నట్టు ఆయనకి అత్యంత సన్నిహితులే చెప్పివారు.

గబ్బర్‌సింగ్‌ రిలీజ్‌ తర్వాత చిరంజీవి మాటల్లో జోష్ బాగా పెరిగింది. దమ్ము పెరిగింది. అంటే తమ అభిమానులేమీ దారి తప్పిపోలేదన్న ధీమా కలిగించింది పవనే. అయితే పవన్‌ గురించి చిన్నప్పటి నుంచీ తెల్సినవారందరూ వవన్‌ నివురు గప్పిన నిప్పని చెబుతుండేవారు. ఏదీ ఒకింతకి బైట పడడని చెప్పుకునేవారు. ఈ నైజమే పవన్‌ని ప్రత్యేకంగా పరిశ్రమలో నిలిబెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తే….పవన్‌ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో జరిగిందిదే. పిఆర్పీ పార్టీని చిరంజీవి ఎంత చిత్తశుద్ధితో నమ్మారో తెలియదు గానీ….పవన్‌ మాత్రం త్రికరణశుద్ధిగా నమ్మి మరీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తీవ్రస్ధాయిలో కాంగ్రెస్‌ పార్టీ మీద విరుచుకుపడ్డారు. పంచలూడదీసి కొడతారు…అన్న ప్రసంగం అప్పుడొక ప్రత్యేకత.

ఎన్నికల అనంతరం పవన్‌ జాడలు పార్టీలో ఎక్కడా కనిపించలేదు. సడన్‌ గా పవన్‌ తెర మరుగయ్యారు. పార్టీ నిర్వహణ విషయంలో చాలా తికమకలు ప్రారంభమయ్యాయి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ మితిమీరిన ప్రమేయాన్ని సహించలేనివారు చిరంజీవితో నేరుగా విబేధించారని అప్పుడు విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక చిరంజీవి అరవింద్‌ పాత్రను పూర్తిగా తగ్గించారని ఒకరిద్దరు ఎమ్మేల్యేలు పాత్రికేయులతో చెప్పిన సందర్భాలున్నాయి. వీటన్నిటీ సైలెంట్‌ గా పరిశీలిస్తున్న పవన్‌ సదరు పరిణామాలను చూసి ఆవేదన చెందినట్టుగా గుప్పుమంది. అయినా కూడా పవన్‌ ఎప్పుడూ కూడా తనదైన అభిప్రాయాన్ని గానీ, ఆలోచనను గానీ ఎక్కడా మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అయితే పార్టీ కార్యక్రమాల నుంచి మాత్రం పూర్తిగా కట్‌ అయిపోయిన వ్యవహారం అందరికీ అర్ధమయిపోయింది.

అల్లు అరవింద్‌ ప్రమేయంతోనే తన అన్నయ్య స్ధాయి దిగజారిపోతోందన్న ఆవేదన సూచనప్రాయంగా అందరి నోటీస్‌ కు వచ్చింది. ఇంక పార్టీని కాంగ్రెస్‌తో విలీనం చెయ్యడం సుతరాము పవన్‌ కి రుచించలేదు. అయినా సరే గుంభనంగా ఉండడం పవన్‌ క్యారెక్టర్‌. తన తొలి రాజకీయ ప్రసంగంలో పవన్‌ కాంగ్రెస్‌ పార్టీని దుమ్మెత్తిపోసిన దరిమిలా పార్టీ విలీన కాలంలో పవన్‌ ఏ విధమైన ఆవేదనకు గురై ఉంటారో ఊహించచ్చు. ఇంక రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు సైద్ధాంతికంగా పవన్‌ కాంగ్రెస్‌ పార్గీ విధివిధానాలను ఏవగించుకున్నారన్నదానిని కూడా ఊహించచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో పరోక్ష్షంగా తన అన్న మెతకవైఖరిని పనవ్‌ జీర్ణించుకోలేకపోయారని సన్నిహిత వర్గాలు చెవులు కొరుక్కున్నారు. సినీ పరిశ్రమలో కూడా అన్నయ్య పడికట్టు విధానాలను పవన్‌ ఎక్కడా అనుసరించలేదు. అనుకరించలేదు. పూర్తిగా వినూత్నంగా, విభిన్నంగా ముందుకు సాగిన రికార్డు పవన్‌కి ఉంది. ఈ నేపధ్యంలో…రాజకీయాలలో కూడా పవన్‌ తన మార్కు చూపించాలనుకున్నారు. ఆనాడు తాను ఏం ప్రసంగించారో…అదే మాట మళ్ళీ మొన్న ప్రసంగంలో చాలా ప్రస్ఫుటంగా వినిపించారు. అదే యాంటీ కాంగ్రెస్‌ విధానం. అప్పుడూ ఇప్పుడూ కూడా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేశారు.

ఛిరంజీవి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుని, కాంగ్రెస్‌ ఖండువాలో దాగుంటే.. పవన్‌ మాత్రం ’కాంగ్రెస్‌ హటావో..దేశ్‌ బచావో’ నినాదంతోనే నిలబడ్డారు. కమర్షియల్‌ మార్కెట్‌ లో కూడా అన్నకు పూర్తిగా భిన్నంగా నిలద్రొక్కకుని..అంటే అల్లు అరవింద్‌ ప్లానింగ్‌ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా తనదైన వ్యక్తిగత విధానాలతో టాప్‌ గేర్‌ వేశారు పవన్‌. ఇప్పుడు రాజకీయాలలో కూడా తనదైన స్వంత బాణీనే నమ్ముకున్నారు. ఏనాటి నుంచో కుటుంబం పరంగా అంతర్గత విబేధాలు రాజుకుంటూనే ఉన్నా, ఇటీవల నాగబాబు కుమారుడు హీరోగా సినిమా ప్రారంభం నాడు చిరంజీవి పట్ల పవన్ ప్రవర్తనా, తర్వాత జనసేన పార్టీ ప్రకటన నాడు కాంగ్రెస్‌పైన నిప్పులు చిమ్మడంతో చిరంజీవి కుటుంబంలో వివాదాలు బాహాటంగా అందరికీ తెలిసొచ్చాయి. పవన్‌ కూడా పూర్తిగా కాంగ్రెస్‌పైనే నెపం పెట్టి తన అన్నదేం తప్పులేదన్నట్టు మాట్లాడినా అది మాత్రం చిరంజీవిపైనెత్తిన ధ్వజమేనన్నది గమనార్హం.