Site icon TeluguMirchi.com

చీకట్లో చిరంజీవి

chiruఅసంఖ్యాక అభిమానులకు అభిమాన హీరోగా వెలుగొందిన ఒకహీరో(ఏ భాషాపరిశ్రమలోనైనా కావచ్చు) ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండడు. అటువంటి పరిస్థితిని చిరంజీవి గత చాలా సంవత్సరాలుగా చవి చూస్తున్నారు. పార్టీ పెట్టి దారుణంగా దెబ్బతిని, మెగాస్టార్‌ అన్న టైటిల్‌నే చేజార్చుకున్నారు.. ఎన్నికల ముందు టిక్కెట్లను అమ్ముకున్నారన్న అపప్రథనూ మూటగట్టుకున్నారు. టిక్కెట్‌ ఇస్తామని ఆశపెట్టి, చివరికి మొండి చేయి చూపించి కొందరి అభిమానుల ఆగ్రహానికీ గురయ్యారు. సదరు అభిమానులు అప్పుడు చిరంజీవితో పెనవేసుకున్న దశాబ్దాల అనుబంధాన్ని తెంపుకుని, సదరు అభిమానులు నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి వైయస్‌ సమక్షంలో కాంగ్రెస్‌ ఖండువా కప్పుకుని జై వైయస్‌ అన్నారు. జరుగుతున్న పరిణామాలను చిరంజీవి ఏనాడూ బేరీజు వేసుకోకపోవడం చేత క్రమక్రమంగా పలచబడిపోతూ వచ్చారు.

సినిమా రంగమంటే సరే. దాని పోకడ, పంథా అన్నీ వేరేగా ఉంటాయి. దానికీ రాజకీయరంగానికి ఏ మాత్రం పొంతన లేదు. ఆ విషయాన్ని చిరంజీవి ఏనాడూ పట్టించుకోకపోవడంతో దారీతెన్నూ లేని మార్గంలో గాలిపటంలా ఎగురుతూ వచ్చారు. తర్వాత దశలో పార్టీని నడపలేని దురవస్థకు లోనయ్యారు. నిజానికి దాదాపు 20సీట్లు ఉన్న ఓ పార్టీ అధినేతగా చిరంజీవి ఏ దశలోనూ నడుచుకోలేదు. ఎవ్వరి సలహాలను సక్రమంగా పాటించలేదు. అసలు ఎన్నికల ముందే ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ చేత నానా శాపనార్ధాలు తిన్నారు. అయినా అవలోకించుకోలేదు. తర్వాత మిత్రా ఎందుకు విబేధించి మాయమయ్యారో ఆరా తీయలేదు. పార్టీలో తనను విశ్వసించి చేరిన సీనియర్‌నాయకులు చేగొండి లాటివారి సలహాలు కూడా ఏనాడూ ఖాతరు చేయలేదు. ఎంత స్పీడుగా పార్టీలో చేరారో అంతే స్పీడుగా వెళ్ళిపోతుంటే ఎందుకిలా జరుగుతోందన్న విచారణకు తావివ్వలేదు. పార్టీని నడపలేక, ఖర్చలకు వెనుకాడి పార్టీ కార్యాలయాలను కూడా మూసివేశారు.

చాలా మందికిపార్టీని కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయడం ఆనాడు ఇష్టంలేదు. అయినా పార్టీనినడపలేకతిన్నగా తీసుకెళ్ళి కాంగ్రెస్‌ చేయి పట్టుకుని, తీరిగ్గా చేతులు దులిసేసుకున్నారు. అది ఆనాడే తమ్ముడు పవన్‌కళ్యాణ్‌కు ఇష్టం లేదని పరిశ్రమలోనూ ,రాజకీయ రంగంలోనూ కూడా గుసగుసలాడుకున్నారు. అది ఈనాడు స్వయానా కళ్యాణే బాహాటంగా చెప్పిన పరిస్థితిని, కాంగ్రెస్‌లో విలీనం చెయ్యకుండా ఉంటే, ఈనాడు ప్రజారాజ్యంపార్టీ రాష్ట్రంలో ఓ ప్రముఖపాత్రను పోషించి వుండేదని పవన్‌కళ్యాణే ప్రత్యక్షంగా చెబుతున్నారు. తన సోదరుడున్న పార్టీనే దేశంలో నుంచి తగిలెయ్యండని అభిమానులకు పిలుపునిస్తే, చిరంజీవి అభిమానుల్లో అధికశాతం మంది చిరంజీవిని వ్యతిరేకించి, పవన్‌ పంచనే చేరుతున్నారంటే చిరంజీవి ఇమేజ్‌ ఎంత భాగా నిలుపుకున్నారో అర్ధమవటం లేదా? పవన్‌ను పార్టీ పెట్టద్దని బ్రతిమలాడారని కూడా వినిపించింది.

కానీ పవన్‌ చిరంజీవిలాగా కాదు. ఒక హార్డ్‌నట్‌. పట్టుబట్టాడంటే దానికింక తిరుగుండదు. విభజనతీరును పవన్‌ ఎంతగా నిరసించారో ఆయన ఉపన్యాసాల ద్వారా తెలుస్తూనే ఉంది. ఆనాడు తమ్ముడు పవన్‌ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించినందుకు తగిన మూల్యాన్నే చెల్లించారు చిరంజీవి. పవన్‌ సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తుంటే చిరంజీవి సభల్లో ప్రజలకన్నా కుర్చీలే ఎక్కువగా కనిపించడంతో నవ్వులపాలయ్యారు. ఇప్పుడు తాజాగా మరో బిరుదును కూడా అందుకున్నారు. బ్రోకర్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌లో దాసరి చేసిన సంచలన వ్యాఖ్యలు చిరంజీవినుద్దేశించి చేసినవేనని గ్రహించలేనివారెవరు? పైగా దాసరి పొడుపు మామ్మూలుగా ఉండదు. చక్కటి క్లూలతో పొడుపుకథ చెప్పినట్టుగా మొన్న ఆడియో పంక్షన్‌లో మాట్లాడి సంచలనం రేపారు దాసరి. టైటిల్‌ని, ప్రస్తుతం ఉన్న `రాజీ`కీయాలను అనుసంథానం చేసి, చిరంజీవిపైన ఉన్న వ్యక్తిగతైమైన కోపాన్ని బాంబు పేల్చినట్టుగా పేల్చారు. ఆఖరుకి మెగాస్టార్‌ నుంచి ఒక బ్రోకర్‌ అన్నమాట వరకూ చిరంజీవిఇమేజ్‌ అథోదిశగా ప్రయాణించింది. ఈ ప్రయాణంలో చిరంజీవి సొంత తప్పిదాలేప్రధానహేతువులుగా విమర్శకులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version