ఏపీ మొత్తం కేంద్రంపై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల విశ్వసనీయతను కలిగి ఉంటారు.
రాష్ట్రం కోసం ఎంపీలు ఆందోళనలు చేశారు అనే విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది. అయితే కొందరు ఎంపీలు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలకు హాజరు అయినట్లుగా కాని, ఆందోళ చేసినట్లుగాని కనిపించడం లేదు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో, ఏపీకి న్యాయం చేయాలని సాగుతున్న ఆందోళనల్లో చిరంజీవి పాల్గొనక పోవడం దారుణం అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
ఆ మద్య కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మానాభంను కలిసి, ఉద్యమంలో పాల్గొంటాను అంటూ హామీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు రాష్ట్రం కోసం మాత్రం ముందుకు రాకపోవడం దారుణం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి కులంపై ఉన్న అభిమానం రాష్ట్రంపై లేదని, కులం కోసం తప్ప ఆయన ప్రజల కోసం ఉద్యమం చేసే నాయకుడు కాదు అంటూ ఎద్దేవ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై చిరంజీవి ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్‌కు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.