చిరంజీవి ఇంటి ముట్టడి !

chiranjeeviపర్యాటక శాఖ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు గురువారం రాత్రి ప్రముఖ సినీ నటుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో.. పోలీసులు విద్యార్థులను అదుపులోనికి తీసుకొని జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిరు ఇంటిముట్టడిపై ఓయు జెఏసి అధికార ప్రతినిధి కృశాంక్ మాట్లాడుతూ… ఏప్రిల్ 12,13,14 తేదీలలో బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం కాన్ఫరెన్స్ నిర్వహించారని, ఇందుకోసం రూ.2.14 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ టూరిజం కాన్ఫరెన్స్ పై ఖర్చు చేసిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించగా.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసినట్లుగా తేలడంతో.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు బాధ్యత వహించి చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.