ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ బతుకమ్మ . ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ ప్రారంభమవుతోంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై చివరిరోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగను అధికారికంగా నిర్వహిస్తోంది. గతేడాది కరోనాతో బతుకమ్మ వేడుకలపై ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’.. అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.