చత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్ : 22 మంది జవాన్లు మృతి, మరో 31 మందికి గాయాలు

చత్తీస్‌ఘడ్ రాష్ట్రం లో బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్పిఎఫ్ జవాన్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్స్ చనిపోగా 31 మంది జవాన్స్ గాయపడ్డారు . మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ చేస్తుండగా ఎదురుగా వచ్చిన మావోయిస్టులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు.

సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, కుల్దీప్ సింగ్ ఈ రోజు ఉదయం సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. సిఆర్‌పిఎఫ్ ఎడిజి (హెచ్‌క్యూ) జుల్ఫికర్ హసన్, ఐజి (ఆపరేషన్స్) నలిన్ ప్రభాత్ కూడా చత్తీస్‌ఘడ్ చేరుకున్నారు. నక్సల్స్ చనిపోయిన సైనికుల ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మరియు వారి బూట్లు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం ఉదయం, జగదల్‌పూర్‌లోని ఫోర్స్ క్యాంప్ లో మరణించిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు నివాళి అర్పించారు. 22 మంది జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.