Site icon TeluguMirchi.com

భాజాపా అగ్రనేతలతో బాబు భేటీ!

tdp-bjpమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి హాజరుకావడానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భోపాల్ వెళ్లిన విషయం తెలిసిందే. భాజాపా అగ్రనేతలతో కలసి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

మోడీతో సమావేశమనంతరం చంద్రబాబు భాజాపా అగ్రనేత అద్వానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తో విడివిడిగా సమావేశమయి మంతనాలు జరిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెదేపా భాజాపాతో జతకట్టనుంది అనే వార్తల నేపథ్యంలో.. తాజా భేటీలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, ఇప్పటికే తెదేపా-భాజాపాల మధ్య పొత్తు ఖరారైందని, త్వరలోనే చంద్రబాబును ఎన్డీయే కన్వీనర్ గా కూడా నియమించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

హైదరాబాద్ లో బహిరంగ సభకు వచ్చిన మోడీ.. తెదేపా జపం చేసినప్పటి నుంచీ.. ఈ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతూ వచ్చింది. తదనంతరం చంద్రబాబు, మోడీ కలసి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. తెదేపా-భాజాపా మరోసారి జతకట్టనున్నాయని ఆయా పార్టీల కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణకు గట్టిగా మద్ధతు పలుపుకుతున్న భాజాపాతో తెదేపా పొత్తు కుదురుతుందా.. ? లేదా.. ? అన్న దానిపై స్పష్టత రావాలంటే.. మరికొంత కాలం ఆగాల్సిందే మరీ.. !

 

Exit mobile version