జగన్ దీనికేమంటారు.. సమాధానం చెప్పండి..

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని ప్రతిపక్ష టీడీపీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకంగా టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ ఓదార్పు యాత్రను కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ప్రత్యర్థులు దాడిచేసి.. వివస్త్రను చేయడంతో మనస్తాపానికి గురై ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని చినగంజాం మండలం రుద్రమాంబపురంలోని ఆమె నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు టీడీపీ తరఫున రూ.5లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.

చంద్రబాబు నాయుడు  పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ.. పద్మ పిల్లల్ని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చదివిస్తామని భరోసా ఇచ్చారు. పద్మ మృతికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ దాడిలో పద్మ భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇటువంటి ఘటనల్ని నాగరిక సమాజం ఖండించాలి. ఇలాంటివి జరుగుతుంటాయని హోంమంత్రి సుచరిత అంటున్నారు. ఈ ఘటనలపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎందుకు మాట్లాడరు? మనవాళ్లను కొట్టి తిరిగి మనవాళ్లపైనే కేసులు పెడతారా? రాష్ట్రంలో  ఇంతవరకు 95 చోట్ల దాడులు జరిగాయి. శాంతిభద్రతల విషయంలో నేను చాలా కఠినంగా ఉన్నాను. నా రక్షణ అంశంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి’ అని చంద్రబాబు వివరించారు.