Site icon TeluguMirchi.com

’యూపీఏ’ ది దారుణమైన పాలన : బాబు

NCBNయుపిఏ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించాడు. అవినీతి, అక్రమాలకు యూపీఏ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని బాబు మండిపడ్డారు. బాబు ఈరోజు (మంగళవారం) తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. 1991 లో ఉన్న దేశ పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయని, తన జీవితంలో ఇంత దారుణమన పాలన చూడలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయం అవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుకు కారకులెవరని, దీనికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఏం సమాధానం చెబుతారని బాబు ప్రశ్నించారు. ఫైళ్లకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ప్రజలను ఏం కాపాడుతుందని బాబుఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకుని పట్టుబడతామనే భయంతో దస్త్రాలను మాయం చేశారని ఆయన ఆరోపించారు. ఎఫ్.డి.ఐ.లలో పెట్టుబడులు అనుమతించినా.. దాని ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆయన అన్నారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంత ఘోరంగా పడిపోయిందని, దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బ తింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి కారణంగా దేశం తీవ్రంగా నష్టపోతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని చెప్పడానికి గర్వపడుతున్నామని బాబు చెప్పుకొచ్చారు. తెదేపాను పెట్టింది తెలుగువారి ఆత్మగౌరవం కోసమేనని బాబు పేర్కొన్నారు.

Exit mobile version