Site icon TeluguMirchi.com

అధిష్టానమే రెచ్చగొడుతోందా ?

shindeకనీవినీ ఎరుగని రీతిలో మహోద్యమంగా రూపొంది ఉధృతంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఆ దిశగా ప్రయత్నించకుండా మరింతగా రెచ్చగొడుతున్న తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. గత 50 రోజులకు పైగా సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల ప్రజలు నిత్యం లక్షల సంఖ్యలో రోడ్లమీదకు వచ్చి స్వచ్చందంగా, స్వచ్చంగా పోరాటం జరుపుతున్న నేపధ్యంలో కేంద్ర సర్కారుకు చీమ కుట్టినట్టినట్టయినా లేకపోవటం దారుణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సమస్యను ఉభయతారకంగా పరిష్కరించే దిశగా కేంద్రం అసలు ఆసక్తి చూపకపోవటం కాంగ్రెస్ అధిష్టానం మొండి వైఖరిని స్పష్టం చేస్తోంది. సి డబ్ల్యూ సి నిర్ణయాన్ని ఏదో శిలాశాసనం గా చూపిస్తూ యావత్ భారత ప్రజలు ఆ నిర్ణయానికి కట్టుబడిఉండాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా వున్నాయి. సమన్యాయం కోసమో, సమైక్యాంధ్ర కోసమో విపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ఇస్తున్న సలహాలు, సూచనలను కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోకపోగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తమ స్వంత పార్టీ నాయకుల రోదనను కూడా హస్తం పార్టీ పెడచెవిని పెడుతోంది.

హస్తిన లో ఉండలేక, తమ స్వంత నియోజక వర్గాలకు రాలేక సీమాంధ్ర మంత్రులు, ఎం పి లు నాయకులు ముందు నుయ్యి, వెనుక గొయ్యి లా నానా అవస్థలు పడుతున్నారు. ఒకపక్క అధిష్టానాన్ని ఒప్పించలేక, మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను తట్టుకోలేక వారు తల్లడిల్లిపోతున్నారు. తమ వాదన వినిపించేందుకు ఎంతగా ప్రయత్నించినా అధిష్టానం వాటిని ఖాతరు చేయకపోవటం వాళ్ళను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. దారుణమైన విషయమేవిటంటే ఇప్పటివరకూ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు తమ గోడు చెప్పుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి అప్పాయింట్ మెంట్ కూడా దొరకని సిగ్గుమాలిన పరిస్థితి నెలకొంది. ఆ కారణంగానే ఈ రోజు దాకా వారు తమ అరణ్యరోదనను రెండవశ్రేణి నాయకులైన దిగ్విజయ్ సింగ్, ఆంటోని, ఆజాద్, వీరప్ప మొయిలీ లాంటి వారికి మాత్రమే వినిపించగలుగుతున్నారు. ఈ రెండవశ్రేణి నాయకులెవరికీ నిర్ణయాధికారం లేదు. కేవలం శ్రోతలు మాత్రమే.

తాజాగా గురువారం సాయంత్రం మన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకబృందం మళ్లీ దిగ్విజయ్ సింగ్ ను కలిసింది. షుమారు రెండుగంటలపాటు తమ ఆవేదనను వెళ్ళగక్కింది. తొందరపడి క్యాబినెట్ నోట్ పై నిర్ణయం గైకోనవద్దంటూ ప్రాధేయపడింది. అంతా విన్న డిగ్గిరాజా వారు ” భయపడకండి. ఆంటోని కమిటి నివేదిక వచ్చేవరకూ తెలంగాణా పై క్యాబినెట్ నోట్ తయారుకాదు ” అని అభయమిచ్చారు. దాంతో మన నాయకులు ఊపిరి పీల్చుకుని బైటికొచ్చేసి ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పేసి తామేదో ఘనకార్యం సాధించినట్టు పోజు పెట్టేశారు. విచిత్రమేమిటంటే సరిగ్గా దిగ్విజయ్ తో సమావేశం జరుగుతున్న సమయంలోనే కేంద్ర హొమ్ మంత్రి షిండే విలేకరులతో మాట్లాడుతూ ” తెలంగాణా పై క్యాబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమై ఇంతకు ముందే నా దగ్గరకు వచ్చింది. నేను దానిని రేపు చూస్తాను. ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే దానిని క్యాబినెట్ ముందు పెడతాము ” అంటూ ప్రకటించారు. ఇదే విషయాన్ని విలేకరులు ఆ తరువాత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను అడిగితే వారు సమాధానం చెప్పలేక విలేకరులపై తమ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.

Exit mobile version