దేశంలో రోజుకి 3,50,000 రెమ్డెసివిర్ వయల్స్ ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 2021 ఏప్రిల్ 11వ తేదీనాటికి దేశంలో రోజుకి కేవలం 33,000 రెమ్డెసివిర్ వయల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యేవని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల వీటి ఉత్పత్తి 3,50,000 కి పెరిగిందని మంత్రి తెలిపారు.
రెమ్డెసివిర్ ను ఉత్పత్తి చేస్తున్న కేంద్రాల సంఖ్యని కేంద్రం నెల రోజుల వ్యవధిలో 20 నుంచి 60కి పెంచిందని మంత్రి తెలిపారు. గిరాకీకి మించి రెమ్డెసివిర్ వయల్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలిపిన మంత్రి దేశంలో అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అన్నారు.
రాష్ట్రాలకు రెమ్డెసివిర్ వయల్స్ ను కేటాయించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించిందని శ్రీ మన్సుఖ్ మాండవియా తెలిపారు. దేశంలో రెమ్డెసివిర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ ఏజెన్సీ, సిడిఎస్కోలను ఆయన ఆదేశించారు. దేశంలో అత్యవసర వినియోగం కోసం 50 లక్షల వయల్స్ ను నిల్వ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.