తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం మరుసటి రోజు జరిగిన తొలి కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నివారణే లక్ష్యంగా దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. కొవిడ్‌ అత్యవసర స్పందన నిధి కింద రూ.23,123 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చు చేయనున్నాయి. రూ.23వేల కోట్లలో రూ.15వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుండగా.. రూ.8వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ వెల్లడించారు. ఈ ప్యాకేజీ జులై 2021 నుంచి మార్చి 2022 వరకు అమలు చేయనున్నట్టు తెలిపారు.

రైతుల మౌలిక సదుపాయాల నిధి కింద రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్‌ అంగీకరించిందన్నారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు విరమించాలని కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని మరోసారి స్పష్టంచేసిన మంత్రి… చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రైతులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.