రాజధాని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో పూర్తి స్థాయి భద్రతకు, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.తారకరామారావు గారు ఇటీవల హైదరాబాద్ మహానగరం పరిధిలో ‘పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ మహానగరం(ఓఆర్ఆర్) పరిధిలోని ఇప్పటి వరకు సీసీటీవీ సర్విలెన్స్ కెమెరాల ఏర్పాట్లు లేని ఇతర అన్ని ప్రాంతాల్లో పోలీసు శాఖ సమన్వయంతో నెల రోజుల వ్యవధిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సీసీటీవీ సర్విలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఆదేశించింది.
ఓఆర్ఆర్ పరిధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఫార్మా, సర్విస్ సెక్టార్ విస్తరిస్తున్న నేపధ్యంలో అందుకు అనుగుణంగా ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రతా ప్రమాణాలను మరింతగా పటిష్టపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు(జీవోనెం.167) జారీ చేశారు.
ఓఆర్ఆర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్ఎల్), సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్సీఆర్), టీఎస్ ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్(హెచ్జిసీఎల్), సెంట్రల్ పవర్ డిస్కమ్(టీఎస్ ఎస్పీడీసీఎల్), మార్కెటింగ్, ఇరిగేషన్ తదితర సంబంధిత ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది.