ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో, రాబోయే రబీసీజన్లో రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇన్పుట్స్ అన్నీ అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శనివారం విజయవాడలో తన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తీవ్ర ఆర్ధిక సమస్యలలో ఉండి కూడా రైతుల సంక్షేమం కోసం రూ.24వేల కోట్ల వ్యయంతో రుణ ఉపశమనం చేశామంటూ, దీనిద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పధం పెంచేదిశగా కృషి చేయాలన్నారు. ఆలస్యమైనప్పటికీ ఇటీవల భారీ వర్షాలు కొంతమేర మేలు చేసిన విషయం ప్రస్తావించి, వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ అధికారులను సమన్వయ పరిచి రైతాంగానికి అండగా నిలిచేలా చూడాలన్నారు. లేటుగా ఖరీఫ్ పంటలు సాగుచేసిన చోట, రాబోయే రబీ సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, రుణపరపతి, ఇతర అవసరాలను గుర్తించి త్వరితగతిన సమకూర్చాలన్నారు.
గత ఏడాది వర్షాభావంలో కూడా ఉన్న నీటిని సద్వినియోగం చేసి పంట దిగుబడులు తగ్గకుండా చూసిన విషయం ప్రస్తావించారు. ‘‘నీరు-చెట్టు’’ కార్యక్రమం అన్ని ప్రాంతాలలో చురుకుగా జరపాలని, భూగర్భజలాల పెంపుదలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ముద్రా యోజన పథకం (పీఎంఎంవై) అమలు గురించి, వివిధ జిల్లాలలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణాల మంజూరు అంశాలపై సమీక్షించారు. ఏయే జిల్లాలలో ఎన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి? ఎన్ని మూత పడ్డాయి? వాటి రుణ పరపతి స్థితిగతులను అధ్యయనం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది తమ కాళ్లపై తాము నిలబడే సామర్థ్యం పెంచుకుంటారని, ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని చెప్పారు. శిశులోన్, కిశోర్ లోన్, తరుణ్ లోన్, మూడు కేటగిరీలలో ఎంతమందికి లబ్ది చేకూరిందో తెలియజేయాలన్నారు.
జిల్లాలలో సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, ఎన్టీఆర్ వైద్యసేవ, రేషన్ పంపిణీ, డ్రైవర్లకు బీమా, తదితర సంక్షేమ పథకాల అమలును సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలలో సహజ వనరుల పరిరక్షణపై ఒక కన్ను వేయాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాఫియా శక్తులను అణిచివేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.