కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి కుటుంబంతో విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు.
కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గేట్‌వే హోటల్‌లో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. కుమారస్వామి భేటీ అనంతరం మీడియాతో ‘రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. అమరావతి నిర్మాణం సజావుగా జరగాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
అలాగే జేడీఎస్, తెదేపా సోదరభావం ఉన్న పార్టీలు. ఎన్డీయేను ఓడించడమే మా లక్ష్యం. అలాగే 17 ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు రావడంలో చంద్రబాబు సఫలమయ్యారని, చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించామని కుమారస్వామి అన్నారు.