Site icon TeluguMirchi.com

ఆత్మస్థయిర్యంతో వచ్చిన యువకుడికి సీఎం 5 లక్షల సహాయం

cbn-help-5lacs
‘రెండు చేతులు లేవనుకుంటున్నారా? నాకు గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉంది. మొండి చేతులతో కారునడుపుతాను. బైక్ తోలతాను’ ఇవేవీ డైలాగులు కావు. రైలు ప్రమాదంలో మణికట్టుదాకా రెండు చేతులూ కోల్పోయిన పట్టి శీనుబాబు అనే యువకుడు ఆత్మవిశ్వాసంతో అన్న మాటలవి. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన అతడి ఆత్మస్థయిర్యాన్ని ముఖ్యమంత్రి మెచ్చుకుని శహభాష్ అన్నారు. వెంటనే లక్షరూపాయలు మంజూరు చేశారు. తనకు ఉపాధి కల్పించాలని అడిగిన అతని అభ్యర్ధనను విని బిసి కార్పోరేషన్ ద్వారా రూ 4 లక్షలు రుణంగా మంజూరు చేయించారు. శుక్రవారం సీఎంఓలో తమ కష్టాలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి సహాయం పొందటానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన రెడ్డి ప్రతాపరెడ్డి తన తొమ్మదిదేళ్ల కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, వైద్యచికిత్సకు సహాయం చేయాలని కోరగా, రోజువారీ చికిత్సకు రూ. 3 లక్షలు మంజూరు చూశారు. విజయవాడలో నివసించే కందుకూరు లక్ష్మి కులాంతర వివాహం చేసుకుని కొంత కాలానికి భర్త నిరాదరణకు గురైంది. తల్లిదండ్రులూ ఆదరించలేదు. ముఖ్యమంత్రితో ఆమె తన కష్టాన్ని చెప్పుకోగా ఆయన తక్షణ సహాయంగా రూ. 50 వేలు మంజూరు చేశారు. వ్యాపారం చేసుకునేందుకు రుణం అందించాలని బిసి కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశంజిల్లా నుంచి అంగవైకల్యంతో సరళ అనే యువతి వచ్చింది. ఆమె ఎంబీఏ చేసింది. తనకు ఉద్యోగం ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరగా అర్హత కలిగిన ఉద్యోగం పొందే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమెకు రూ 25వేలు ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. అనేక మందికి ఇళ్లు, పెన్షన్లు మంజూరు చేశారు. అవసరానికి తగినట్లు ఆర్ధిక సహాయం అందజేశారు. తమకు పెన్షన్లు అందటం లేదని అనేక మంది ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి స్పందించి ఈ పర్యాయం ఇటువంటి ఫిర్యాదులు వస్తే సీఎంఓ కార్యాలయ అధికారులే విచారించి అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

Exit mobile version