తుపాను, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని బుధవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శుక్రవారం ఉదయం 12 గంటలకు నష్టం జరిగిన ప్రదేశాలను పరిశీలించడానికి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. గం.12.50ని. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో జరిగిన వరద నష్టాన్ని పరిశీలిస్తారు. ఇదే మండలంలో వరదకు కొట్టుకుపోయిన రాచుపల్లి కాజ్ వే నష్టాన్ని పరిశీలిస్తారు.
అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లా గూడూరు చేరుకుని, గూడూరు పరిసర ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం నెల్లూరు చేరుకుని వరద నష్ట పరిస్థితులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, నెల్లూరులో బస చేస్తారు.
శనివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరి కలకత్తా – చెన్నై జాతీయ రహదారి (ఎన్ హచ్ 5) మనుగోలు వద్ద కొట్టుకుపోయిన రోడ్డు పునర్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఇక్కడ సుమారు 30 మీటర్ల మేర 40 అడుగుల లోతు కొట్టుకుపోయిన జాతీయ రహదారిని రోడ్డు భవనాల శాఖ – నేషనల్ హైవే ఆథారిటీ ఇంజనీరింగ్ బృందాలు రికార్డు స్థాయిలో మూడురోజుల్లో పునర్ నిర్మించి జాతీయ రహదారిపై ఇప్పటికే చిన్నస్థాయి వాహనాలు రవాణాను పునరుద్ధరించడం జరిగింది. ఈ పనులను పరిశీలించిన అనంతరం సోమశిల ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షిస్తారు.
కాగా విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీ ధనుంజయరెడ్డి తాజా పరిస్థితిని తెలియపరుస్తూ నెల్లూరు జిల్లాలో ఇంకా పలు ప్రాంతాలు ముంపులో ఉన్నాయని, 156 సహాయ శిబిరాలను నిర్వహిస్తూ, నిర్వాసితులకు ఆహరం, మంచినీరు అందిస్తున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇంకా 10 సబ్ స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరించవలిసి ఉందని, రైల్వే అధికారులు రెండింటిలో ఒక లైను ఇప్పటికే పునరుద్ధరించారని, ఆ యా స్టేషన్లలో ఉండిపోయిన ప్రయాణీకులను వారివారి గమ్యస్థానాలలో చేర్చడం మొదలైందని అవసరమైన చోట అదనపు రైళ్లను కూడా నడుపుతున్నారని తెలియజేశారు.
గురువారం చిత్తూరు జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడం, శ్రీకాళహస్తిలో 7 తుపాను శిబిరాలు ఇంకా కొనసాగిస్తున్నామని, తిరుపతిలో మరికొన్ని సహయ శిబిరాలు ఈ రోజు శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నామని తెలియజేశారు.