Site icon TeluguMirchi.com

ముఖ్యమంత్రి బక్రీద్ శుభాకాంక్షలు

bakrid-chandrababu
బక్రీద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వున్న ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి గురుతుగా చేసుకునే ఈ పండుగ తెలుగుప్రజల మధ్య చక్కటి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆనాదిగా తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ సర్వమతాలను ఆదరిస్తూ అన్ని పండుగలను కలిపి జరుపుకుంటారని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని ప్రజానీకం పీర్ల పండుగ వంటి సందర్భాల్లో ఏకమవుతారని అన్నారు. అలాగే, రాష్ట్రంలో వున్న దర్గాలను మతాలకు అతీతంగా అందరూ సందర్శించడం గొప్ప లౌకిక భావనకు ఆలంబనగా నిలిచిపోయిందని అన్నారు. ప్రభుత్వం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తోందని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.

తొక్కిసలాట ఘటనపై విచారం
మక్కాలో గురువారం జరిగిన తొక్కిసలాట ఘటనలో పెద్దసంఖ్యలో యాత్రికులు మరణించిన వైనంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పవిత్ర హజ్ యాత్రలో 220మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం తనను కలచివేస్తోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన హజ్ యాత్రికులందరూ తిరిగి క్షేమంగా స్వరాష్ట్రానికి చేరుకునేలా చూడాలని, వారి బాగోగులు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి శ్రీ పల్లె రఘునాథరెడ్డిని ఆదేశించారు. వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని బంధువులకు అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు.

Exit mobile version