Site icon TeluguMirchi.com

అమ్మ పై 420 కేసు.. !

telangana-soniagandhiకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి పదో మెట్రోపాలిటిన్ కోర్టు కుషాయిగూడ పోలీసులకు ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రజలను సోనియా మోసం చేసిందని.. ఫలితంగా అమాయకులైన విద్యార్థుల మృతికి ఆమె కారణం అయిందని.. హైదరాబాద్ కు చెందిన బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు సతీష్ అగర్వాల్, న్యాయవాది మేకల శ్రీనివాస్ యాదవ్  కోర్టును ఆశ్రయించారు.

2009 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిందని, అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొందని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా, 2009 డిసెంబర్ లో అప్పటి హోంమంత్రి చిదంబరంతో తెలంగాణపై ప్రకటనలు చేయించడం.. తదనంతరం పరిణామాల నేపథ్యంలో.. కాంగ్రెస్ కేవలం రాజకీయ కారణాలచేతనే తెలంగాణ ఇవ్వకుండా.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని పిటిషనర్లు తమ పిటిషిన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సోనియాగాంధీపై ఐపిసి సెక్షన్ 420, 120బి కింద కేసు నమోదు చేసి విచారణ జరిపి, 29లోగా నివేదికను సమర్పించాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది.

అయితే కోర్టు ఆదేశాలను ఉన్నతాధికారులకు చూపించి వారి సూచనల మేరకు కేసు నమోదు చేస్తామని స్టేషన్ ఇన్ స్పెక్టర్ తెలియజేశారు. అయితే.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలనుకుంటే.. బహుశా రాజకీయనాయకులు జైల్లోనే ఉండాల్సివస్తుందేమోనని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. మరి ఎప్పుడూ అమ్మ సోనియా గాంధీ జపం చేసే విహెచ్ లాంటి సీనియర్, జూనియర్ కాంగ్రెస్ నేతలు.. అమ్మపై కేసు అంటే ఎలా రియాక్ట్ అవుతారో చూడలి.

Exit mobile version