Site icon TeluguMirchi.com

కారుకు రివర్స్ గేర్ !

TRSగాల్లో పిట్టను చూసి మసాలా నూరుతుంటే, పక్కన వుంచుకున్న పిట్ట తుర్రుమందట. అలాగా వుంది తెలంగాణా రాష్ర్ట సమితి అధ్యక్షుడు కెసిఆర్ వైనం. పక్క పార్టీల నుంచి జనాల్ని తెచ్చుకొచ్చి, పార్టీ తీర్థం పోసి, ఎన్నికల్లో గెల్చేయాలని మాస్టర్ ప్లాన్ వేశారు. డెడ్ లైన్లు విధించారు. కానీ దాని వలన ప్రయోజనం లేకపోగా అనవసరంగా మాట జారిన చందమైంది. తన బలహీనత బయట పెట్టుకున్నట్లయింది. ఇప్పుడు ఇది కాదు అసలు సంగతి. బయత నుంచి ఎవరు వస్తారా అని వీధి గుమ్మం దగ్గర నిల్చుని చూస్తుంటే, పెరటిగుమ్మంలోంచి, స్వంత జనాలు జారిపోతున్నారు. మాజీమంత్రి చాడ సురేష్ రెడ్డి, పార్టీలో కీలకపదవుల్లో వున్న సారంగపాణి, దొమ్మేటి సాంబయ్య కారు దిగి సైకిల్ ఎక్కేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణాలో కారు హవా సాగుతోందని, టికెట్ దొరకాలే కానీ గెలుపు ఖాయమని ఎక్కడలేని ఆశలు పెట్టుకున్న రాజకీయ నాయకులకు ఈ పరిణామం చిన్న కుదుపునిచ్చింది. మారుతున్న తెలంగాణా రాజకీయ ముఖచిత్రానికి ఇది అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో పోటీ వన్ సైడ్ గా వుంటుందని అనుకోవడానికి లేదని ఈ సంఘటన చాటి చెబుతోంది. జారిపోయేవాళ్లు జారిపోగానే, అర్జెంట్ గా తామే సస్పెండ్ చేశామంటూ తెరాస ప్రకటించడం విశేషం. దీంతో కేసీఆర్ నిత్యం ఆడిపోసుకునే ఆంధ్రా పార్టీలకు తన పార్టీకీ తేడాలేదని మరోసారి చెప్పినట్లు అయింది. ఇకనైనా కెసిఆర్ పక్క చూపులు చూడకుండా, తన పార్టీని బాగుచేసుకునే పనిలో పడతారేమో చూడాలి.

Exit mobile version