‘ఏపీ బడ్జెట్’ సమావేశాలు షురు!

kodela
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల ఆరో తేది వరకు కొనసాగనున్నాయి. ముందుగా అనుకున్నట్లు వచ్చే నెల 12 వరకు జరగాల్సి వున్న ఈ సమావేశాలు టీ-ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆరో తేదితో ముగియనున్నాయి. ఆదివారం గవర్నర్ సమక్షంలో జరిగిన సమావేశాలో టీ-ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో.. శనివారాలతో కలుపుకొని 18దినాలు సమావేశాలు జరగనున్నాయి.

నవ్యాంధ్రప్రదేశ్ కు ఇవే తొలి బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్ లను ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల ఆర్డినెన్స్-2014, వ్యవసాయ, దేవాదాయ కమిటీలను రద్దు చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్ లు సభ ముందుకు రానున్నాయి. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను పదును పెట్టే పనిలో నిమగ్నమైంది.