Site icon TeluguMirchi.com

చిత్తూరులో ‘బ్రిటానియా’

britania-industries-limited
FMCG దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయిన బ్రిటానియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ చిత్తూరు జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ. 125 కోట్లతో ఏర్పాటుచేయనున్న యూనిట్ తొలిదశ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా ఆరంభిస్తామని ఆయన ప్రకటించారు. చెన్నయ్, బెంగళూరు మార్కెట్ అవసరాలను తీర్చేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నామని బెర్రీ చెప్పగానే, చిత్తూరు జిల్లానే అందుకు తగినదని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న వనరులు, అవకాశాల గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందని, ఉద్యాన పంటలు, ఫిషరీస్, పశుగణాభివృద్ధి, డెయిరీ, పౌల్ట్రీ రంగాలలో 24 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. 2014-15లో ఆయారంగాలలో రూ.1.43 లక్షల కోట్లు వున్న ఉత్పత్తుల విలువను 2015-16 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెంచేందుకు మిషన్‌మోడ్‌తో పనిచేస్తున్నట్టు చెప్పారు. డెయిరీ రంగంలో కూడా విస్తృత అవకాశాలు వున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి, డెయిరీ రంగంలో వీరి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకుంటున్నామన్నారు. పశుగ్రాసం పెంచేందుకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, గ్రాసానికి తగినట్టుగా దిగుబడి తీసుకొచ్చే బాధ్యతలను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా విస్తారమైన మార్గాలు వున్నాయని, రొయ్యల ఉత్పత్తిలో అగ్రగామిగా వున్నామని వివరించారు. సముద్ర ప్రాంత ఆహార ఉత్పత్తులలో మేటిగా నిలిచి ఎగుమతుల్లో అగ్రస్థానం సాధించాలనదే ధ్యేయమని చెప్పారు. సుదీర్ఘమైన కోస్తాతీరం, అపారమైన జలవనరులు, 14 పోర్టులతో ఏపీ ఆగ్నేయాసియా దేశాలకు ముఖద్వారంగా నిలవనున్నదని అన్నారు. బ్రిటానియా కంపెనీ మొత్తం వ్యాపారంలో 75 శాతం బిస్కట్లదేనని, ఇంకా కేక్స్, డెయిరీ ఉత్పత్తులు, రస్కుల తయారీలో కూడా కంపెనీ నిమగ్నమైందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బెర్రీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. మరో 10-15 సంవత్సరాలలో చంద్రబాబు తన విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రరాష్ట్రంగా మార్చుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

Exit mobile version