బొత్స వర్సెస్ జేసీ !

botsa jcకాంగ్రెస్ పార్టీని, మేడమ్ సోనియా ని విమర్శిస్తే సహించేది లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఇటీవలి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహించి సోనియా రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. జేసీ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ తాను సోనియాకు లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఇలాంటి వారిని పార్టీనుంచి సాగనంపాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ పరాజయానికి సోనియా ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

అయితే ఇందుకు ధీటుగానే స్పందించిన జేసీ .. తనకంటే ముందు బొత్సపైనే చర్యలకు ఉపక్రమించి సస్పెండ్ చేయాలన్నారు. బొత్స.. కేంద్రంలోని మంత్రులు, ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత మాట్లాడాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు తీసుకుని నున్నగా ఊడ్చేసిందని కాంగ్రెస్ పై పరోక్షంగా వ్యాఖ్యానించిన జేసీ.. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వస్తే దానిలో చేరేందుకు ఆలోచిస్తానన్నారు. ఇక సోనియా పై చేసిన విమర్శలను గురించి వివరిస్తూ.. తాను సోనియాను కించపరచలేదని, అనారోగ్యం కారణంగానే పదవినుంచి తప్పుకోవాలని సోనియాను కోరానని వివరణ ఇచ్చారు.