గ్రేటర్ హైదరాబాద్ లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు గాను 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 224 బస్తీ దవాఖానాలను ప్రారంభించడం జరిగిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. నేడు జియాగూడలోని మరాఠి బస్తీ, హాసిఫ్ నగర్ లోని సాబేర్ నగర కాలనీ, తలాప్ చంచలమ్ లోని సిద్దికీ నగర్, శాలిబండలోని కుమ్మర్ వాడి, మొగల్ పురలోని సుల్తాన్ షాహీ లలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మేయర్ బొంతు రామ్మోహన్ నేడు ప్రారంభించారు.
మంగళహాట్ లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ… మరో నెల రోజుల్లోగా 50 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలోని నిరుపేద, బడుగు బలహీనవర్గాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో భాగంగా పెద్ద ఎత్తున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటితో పాటు మరెక్కడైనా అవసరం ఉంటే అదనంగా కూడా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన 200 బస్తీ దవాఖానలకు తోడు నేడు మరో 24 బస్తీ దవాఖానలను సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారని తెలిపారు. ప్రతి బస్తి దవాఖానకు ప్రతిరోజు కనీసం 70 నుండి 150 మందికి పైగా వివిధ ఆరోగ్యపరమైన సమస్యలపై ప్రాథమిక చికిత్స, పరిక్షల కోసం వస్తున్నారని పేర్కొన్నారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, కంపౌండర్, మలమూత్ర పరీక్షల విభాగం, అటెండర్లు ఉంటారని తెలిపారు.
నగర ప్రజలకు తక్షణ వైద్య సదుపాయం అందించడంలో బస్తీ దవాఖానలు సహాయపడుతున్నాయని, వ్యాధితీవ్రతను బట్టి ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ తదితర ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నామని మేయర్ తెలిపారు. తమ బస్తీలోనే ప్రత్యేకంగా దవాఖానలను ఏర్పాటు చేయడం పట్ల బస్తివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళహాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.