బిజెపి పార్టీ కి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈరోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్య కర్తలు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బిజెపి పార్టీ కి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

1980 ఏప్రిల్ 6వ తేదీన బీజేపీని స్థాపించారని, నేటికి నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి రూపకల్పన చేసిన అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ, బైరాన్ షింగ్ షెకావత్ వంటి రాజకీయ యోథులకు మన స్ఫూర్తిగా నమస్కరిస్తున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన బీజేపీ, ప్రజల పార్టీగా ఆవిర్భవించిందని, ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని కొనియాడారు. వ్యవస్థాపక నేతల ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఒకరేమిటి ఆ పార్టీలో అంతర్గతంగా పనిచేస్తూ బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్న ప్రతిఒక్కరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నానని పవన్ ప్రకటనలో తెలిపాడు.