హుజూర్‌ నగర్‌లో బీజేపీ పోటీ పడనుందా?

తెలంగాణ పీసీసీ చీప్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచిన కారణంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో త్వరలోనే హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంకు ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్‌ ఆ స్థానంను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోయిన పరువును ఈ ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం హుజూర్‌ నగర్‌కు సంబంధించిన ఉప ఎన్నికల గురించి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ మరియు కాంగ్రెస్‌లు మాత్రమే పోటీకి వస్తాయని అంతా భావించారు. కాని బీజేపీ కూడా పార్టీ సీనియర్‌ నేతను ఒకరిని హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి దించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుందని, అందుకే హుజూర్‌ నగర్‌లో సత్తా చాటుతామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. బలమైన వ్యక్తిని నిలిపి హుజూర్‌ నగర్‌ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసేందుకు కాషాయదళం ప్రయత్నిస్తుంది. మరి ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.