వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రికార్డులు, ఫైల్స్ ను ఈ నెల 13వ తేదీలోపుగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. అయితే మంగళవారం అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మరో వైపు వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో దొరికిన లేఖను సమర్పించాలని కోర్టు సూచించింది.
ఇక తనపై చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరఫు లాయర్ ఈ హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ జరుపుతోందని న్యాయ స్థానానికి తెలిపారు.