నాగార్జునపై దాడి వెనక

nagarjunaహీరో నాగార్జునపై ఇటీవల విమర్శల దాడులు ప్రారంభమయ్యాయి. మా టీవీ ద్వారా నిమ్మగడ్డకు మిత్రుడు కావడం, తద్వారా జగన్ కు చేరువకావడం అన్నది అందరికీ తెలిసిందే. అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోలో అదనపు నిర్మాణాలకు అనుమతి విషయంలో నాగార్జునకు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ అనుకూలంగా వ్యవహరించిన సంగతీ విదితమే. అయితే ఇప్పుడు కొత్తగా గురుకుల్ భూముల దగ్గరలో చెరువు ఆక్రమణపై తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాగార్జున మద్ధతు జగన్ కు వుంటుందా, వుండదా అన్నది పక్కన పెడితే, పలు రాజకీయపక్షాలు వుంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి నాగార్జున ఒకప్పుడు లోక్ సత్తా (అప్పటికి ఇంకా పార్టీ మారలేదు)కు కూడా మద్ధతు తెలిపారు. అంతకు మించి అక్కినేని కుటుంబం రాజకీయాల్లో వేలుపెట్టిన సందర్భాలు లేవు. సుబ్బరామిరెడ్డితో దగ్గర సంబంధాలు వున్నా, కాంగ్రెస్ కొమ్ముకాసిన వైనం లేదు. దానా దీనా తేలేదేమిటంటే, నాగార్జున బాహాటంగా వచ్చి, జగన్ వెనక నిల్చునే పరిస్థితి లేదు. నాగార్జునలాంటి తెలివైన వ్యాపారవేత్త, నటుడు అంత సులువుగా బయటపడి తమ భవిష్యత్ ను ఇరకాటంలో పెట్టుకోరు. మరి అటువంటప్పుడు ఎందుకు కొందరు నాయకులు నాగార్జునను టార్గెట్ చేస్తున్నట్లు? స్టూడియోలో వాణిజ్య కార్యకలాపాలు అన్న ఆరోపణ పెద్దది, పైగా కొత్తది ఏమీ కాదు. దాదాపు అన్ని స్టూడియోల్లోనూ జరుగుతున్నదే. ఇటు రామానాయుడు స్టూడియోలో, అటు రామోజీ స్టూడియోలో పలు రకాల ఇన్ స్టిట్యూట్ లు వుండనే ఉన్నాయి. రాఘవేంద్ర రావు మల్టీఫ్లెక్సీపై కోర్టు గొడవలు వుండనే ఉన్నాయి. కానీ కొత్తగా నాగార్జున ఏదో అపరాథం చేసినట్లు వీధికెక్కడం వెనుక ఎన్నికల వేళ ఏదో తెలియని వ్యవహారం వుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాగార్జున మద్ధతు జగన్ కు దక్కకుండా చేయడానికి అయితే ఇంత యాగీ చేయనక్కర్లేదు. లోపాయికారీగా మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ అంతకు మించిన వ్యవహారాలేవో ఇందులో ఇమిడి ఉన్నాయని తెలుస్తోంది. అదేమిటో ఈ గొడవ మరింత ముదిరితే తప్ప బయటకు రాదు. కానీ బయటకు రాకుండా వ్యవహారాలను సుద్దుమణిగేలా చేయడంలో కూడా నాగార్జునను తక్కువ అంచనా వేయడానికి లేదు.