ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. బీసీసీఐ కీలక నిర్ణయం


ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌ కావడంతో దాన్ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్‌ కూడా చేసినట్టు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, హైదరాబాద్‌, ముంబైలు ఈ లిస్టులో ఉండగా వాటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

వన్డే ప్రపంచకప్‌ కంటే ముందు దేశంలో స్టేడియాలను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించేలా చేసేందుకు కొన్ని చర్యలు తీసుకోనుంది. దీని కోసం రూ.500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయడానికి సిద్ధమైంది. ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు.

బీసీసీఐ ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి ఆ బడ్డెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా సీటింగ్‌ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా ఈ నిధులతో మెరుగు పరచనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలో పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే స్టేడియానికి రూ.78.82 కోట్లు ఖర్చు చేయాలని అంచనాలు వేసుకుంది.