బంగారు తల్లికి బాలారిష్టాలు

bangaru-thalliప్రపంచం మొత్తం ఎప్పటికీ మారని వ్యవస్థలపై సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ వాటిలో ప్రథమస్థానంలో వుంటుంది. బాగుపడదామనే ఉద్దేశం కానీ, బాగుచేస్తున్న వాడికి చేయనిచ్చే వ్యవహారం కానీ ఆ పార్టీలో అంతగా వుండడు. నిన్న మొన్నటి దాకా రాష్ర్ట కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి ఆండ్ కో ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తూ, ఢిల్లీకి సీజన్ టిక్కెట్ లు కొనుక్కొని తిరిగేసారు. ఎన్నికలు ఏడాదిలోపుకి వచ్చేసరికి కిరణ్ కుమార్ రెడ్డికి కొంచెం భరోసా రావడంతో ఎలాగైనా తన వంతు తాను చేయాలని ఏవేవో జనాకర్షక పథకాలు ప్రవేశ పెట్టడం ప్రారంభించారు.

నిత్యావసర సరకుల పథకం కాస్త జనాన్ని ఆకట్టుకోవడంతో, ఉన్నట్లుండి బంగారుతల్లి పథకాన్ని ప్రకటించారు. నిజానికి ఇది అద్భుతమైన ఆలోచన. సరియైన నియమ నిబంధనలు రూపొందించి అమలు చేయాలే కానీ, ఇటు పార్టీ అటు ప్రజలకు మేలు చేసే మంచి పథకం. సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలే కానీ ప్రతిపక్షాలను పక్కకు నెట్టి, కాంగ్రెస్ కు ఓట్లు కురిపించగలదు. కానీ అక్కడే మళ్లీ కాంగ్రెస్ నేతల బుద్ధి బయటపడింది. ఇది మంచి పథకమని, దీంతో ఓట్లు రాల్తాయని తెలుసు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఇలాంటి పథకాలు పెట్టి, జనంలో ఇమేజ్ పెంచుకుని, పొరపాటున కాంగ్రెస్ కు మెజార్టీ వస్తే, మళ్లీ కిరణ్ ఎక్కడ ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చేస్తారో అన్నది వారి భయం. అయితే అలా బయటపడితే ఎలా? అందుకే ఎక్కడలేని సాకులు వెదుకుతున్నారు. రఘువీరారెడ్డి, బొత్స, దానం తదితరులు ఈ పథకం ప్రవేశపెట్టడంపై తమదైన స్టయిల్ లో మాటలు విసురుతున్నారు. పథకం బాగా లేకుంటే నిలదీయండని.. అసలు వివరాలు ఇంకా తెలుసుకోవాల్సి వుందని.. మంత్రి వర్గంలో చర్చించాల్సి ఉందని.. ఇలా ఎవరికి తోచినట్లు వారు.

నిజానికి ముఖ్యమంత్రి ఏకపక్ష పథకం ప్రవేశపెట్టి వుండొచ్చు. అది సరియైన చర్య కాకపోవచ్చు. అయినా కూడా ఈ పథకం మంచి దైనప్పుడు, ప్రజలకు, పార్టీకి పనికి వస్తుందని తెలిసినప్పుడు, మద్దతు పలకాల్సిన బాధ్యత పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిపైనా వుంది. ఇదే పథకం చంద్రబాబు ప్రవేశపెట్టినా ఇలాగే వ్యవహరించేవారు. కానీ, పార్టీలో ప్రతి ఒక్కరితో చర్చించి కాదు. కానీ ఎప్పుడు దేశం నేతలు ఇలా చిత్తానికి వచ్చినట్లు మాట్లాడకుండ, ఇంత మంచి అయిడియా చేసిన నేతను గాల్లోకి ఎత్తేసేవారు. కానీ ప్రజాస్వామ్యం మితిమీరి చెలరేగే కాంగ్రెస్ పార్టీ కనుక ఇంతటి యాగీ. సరే ఈ సంగతి అలా వుంచితే, ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో వుంచుకుని పథకం ప్రవేశపెట్టడం కాదు. దీనికి సరియైన నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉంది.

గతంలో ఆడపిల్లలకు డిపాజిట్ చేసే పథకం ఒకటి అమలులో ఉంది. దీని కింద నమోదు చేసుకున్న లక్షలాది మందికి ఇప్పటికీ డిపాజిట్లు లేవు. ఒక్కసారి డిపాజిట్ కే ఇన్ని అవకతవకలు వుంటే, మరీ పుట్టిన దగ్గర నుంచి డిగ్రీవరకు చదివించడం అంటే తమషా కాదు. ఇకపై పుట్టే కొన్ని లక్షల మందికి ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుంది. పైగా ఇక్కడో గమ్మతు ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఒకటవ తరగతికి రావాలంటే కనీసం ఇంకా అయిదేళ్లు. అప్పటికి ఏ ప్రభుత్వం వుంటుందో తెలియదు. వారు ఈ పథకాన్ని కొనసాగిస్తారో లేదో అంతకన్నా తెలియదు. అందువల్ల ఈ పథకానికి ఇప్ప్పుడే సరియైన విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. జనానికి దాని మంచి చెడ్డలు పూర్తిగా తెలియచెప్పాల్సి ఉంది. అంతే కానీ మబ్బులో నీళ్లు చూపించి, దాహం తీర్చుకోమని చెప్పడం సరికాదు.