బాద్ షా ‘కిరణ్’ దూకుడు

cm-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం ఒక్కసారిగా జోరందుకుంది. రెండు నెలలక్రింతం వరకు ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రజాపక్షాలు ఇంతంటి అసమర్థ మఖ్యమంత్రిని రాష్ర్టం చూడలేదని పదే పదే ఆరోపణలు గుప్పించాయి. రెండేళ్ల క్రితం ఎటువంటి పూర్వానుభవం లేకుండానే ముఖ్యమంత్రి గద్దెనెక్కిన కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడే అందరు తక్కువ అంచనా వేశారు. అనుభవం లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న రాజకీయ చతురత అపారం. ఆ చతురత ఉపయోగించే ఎవరి అంచనాలకు అందకుండా, ఎటువంటి ముందస్తు ఊహాగానాలకు తావు ఇవ్వకుండా ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. అయితే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ప్రత్యేకమైనవి. కాళ్లులాగే మహానుభావులకు కొదవలేని పార్టీ అది. దానికి తోడు తుమ్మాలన్నా, దగ్గాలన్నా అధిష్టానం అనుమతి తీసుకోవాల్సిన అవసరమే కాదు. వేచి ఉండాల్సిన ఓపిక కూడా ఉండాలి. ఇలాంటి పరిస్థితులను తట్టుకుంటూ, తనది కాని మంత్రి వర్గాన్ని తలపై మోస్తూ.. రెండేళ్ల కాలం నెట్టుకురావడం అంటే అంత సులువైన పని కాదు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చి, సహకార ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకొని, పంచాయితీ ఎన్నికలను ప్రతిపాదించి, తన పదవి ఆయుష్షును సార్వత్రిక ఎన్నికల వరకు పెంచుకోగలిగారు. అదిగో, సరిగ్గా అప్పుడు మొదలైంది. రాష్ట్రానికి బాద్ షా లాంటి కిరణ్ దూకుడు.

ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దృష్టంతా ఎన్నికలపైనే . ఇందుకోసం పూర్వరంగాన్ని ఆయన బాగానే తయారు చేసుకున్నాడు. తన పక్కలో బల్లెంలా ఉన్నపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తన తోవకు తెచ్చుకున్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రులను జగన్ కేసు సాకుగా కార్నర్ లోకి నెట్టి నోరు మెదపకుండా చేశారు. దీంతో మిగిలిన మంత్రులు సైతం మౌనం వహించాల్సి వచ్చింది. ఇలా ఇంట గెలిచాక కిరణ్ ప్రజల వైపు దృష్టి సారించారు. నిత్య అవసర వస్తువుల పథకం, ఎస్. సి, ఎస్. టి ప్రణాళిక, రైతు బడ్జెట్, ఇప్పుడు తాజాగా బంగారు తల్లి పథకంతో ఆయన ప్రజల్లో కాంగ్రెస్ పై ప్రతిష్టను, అదే సమయంలో తన ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ హవా ఉందనుకున్నా, తెలుగుదేశం పట్ల ప్రజల్లో సానుకూల ధోరణి కాస్త పెరిగిందని అనుకున్నా, వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ అంత నిరాశజనకంగా ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నా అక్కడి ఎంపీలు ఇంకా పార్టీ మారడానికి బదులు కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేయాలని అనుకుంటున్నారు. అటువంటిది ఎటువంటి తలకాయనొప్పులు లేని ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ మరీ అంత చావు దెబ్బతినే అవకాశం లేదు కాక లేదు. ఇప్పుడు కిరణ్ చేస్తున్న ఈ ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీ మరీ అద్భుతమైన ఫలితాలు సాధించక పోయినా కాస్తయినా పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి అదృష్టం బాగుండి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించగలిగితే కచ్చితంగా ఆ క్రెడిట్ ఆయన జేబులోనే పడుతుంది. ఇందుకు అడ్డంగా ఉన్న మిగిలిన వారిని కూడా ఆయన ఎన్నికల నాటికి ప్రక్కకు తప్పించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.