నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్దుకొండ అప్పలనాయుడు భారీ మెజార్టీ తో గెలుపొందారు. నెల్లిమర్ల నియోజకవర్గ హిస్టరీనే తిరగరాసి సరికొత్త రికార్డు సృష్టించాడు అప్పలనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో వైస్సార్సీపీ విజయకేతనం ఎగరవేసింది.
సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న జగన్‌పై నమ్మకముంచిన ప్రజలు అఖండ మెజార్టీతో ఆయనకు అధికారం అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ..లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలుండగా… ఏకంగా 22 స్థానాలను కైవసం చేసుకొని… రికార్డు సృష్టించడమే కాకుండా… లోక్ సభలో 4వ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే స్థాయి నుంచీ ప్రస్థానం మొదలుపెట్టిన వైసీపీ ఈ స్థాయిలో దూసుకెళ్తుందనీ, చరిత్రను తిరగరాస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే.. నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు బడ్దుకొండ అప్పలనాయుడు ను భారీ మెజార్టీ తో గెలిపించారు. బడ్డుకొండ 1995 లో మోపాడ గ్రామ సర్పంచ్ గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో తనదయిన ముద్ర వేసుకోవడం తో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడిగా , సమితి ప్రసిడెంట్ గా ఎన్నికయ్యారు.
2006 లో కాంగ్రెస్ పార్టీ తరుపున డెంకాడ జెడ్పిటిసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007 లో విజయనగరం జెడ్పి చెర్మన్ గా ఎంపికయ్యారు. 2009 లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి 9 వేల మెజార్టీ తో ఎమ్మెల్యే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడి ఫై 28051 ఓట్ల మెజార్టీ తో విజయకేతనం ఎగరవేశారు. ప్రజలు ఎంతో నమ్మకం తో గెలిపించడం పట్ల వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు.