అసెంబ్లీ ‘టీ’ వార్ రెడీ !

aఅందరూ అమితాసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు రేపటి నుంచి అసెంబ్లీ వేదిక కానుంది. విభజన బిల్లును అడ్డుకుని కేంద్రానికి తిప్పి పంపాలని సమైక్య నేతలు, ఎలాగైనా బిల్లుపై చర్చజరిపి రాష్ట్ర విభజనకు దారులు పరచాలని తెలంగాణ నేతలు శస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కిరణ్ అనుసరించబోయే వ్యూహం, దాన్ని ఎదుర్కొనేలా తెలంగాణ వాదులు రూపొందించే ప్రతివ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి రేపటి నుంచి జరిగే మలివిడత శాసనసభ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన బిల్లుపై చర్చే ప్రధాన అజెండాగా రేపటి నుంచి జరగనున్న మలివిడత అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా బిల్లుపై తమ వాదాన్ని వినిపించేందుకు నేతలు రెడీగా ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మైలేజ్‌ పెంచుకునే పనిలో పడ్డారు. పార్టీలకు అతీతంగా నేతలు ప్రాంతాల వారీగా చీలిపోయారు. దీంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.

kiranసమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న… ముఖ్యమంత్రి కిరణ్ అనుసరించబోయే వ్యూహంపై అందరి దృష్టి పడింది. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించైనా, బిల్లును వ్యతిరేకించాలని సీఎం కిరణ్ డిసైడైపోయారు. ఈ వ్యవహారంలో తనకు అడ్డుగా నిలుస్తారని భావించిన మంత్రి శ్రీధర్‌బాబును శాసన సభ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పించడడం.. సీఎం ముందస్తు ప్రణాళికలో భాగమనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీధర్‌బాబు స్థానంలో సమైక్య వాదాన్ని వినిపించే మంత్రి శైలజానాథ్‌ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. ఆయనతో బిల్లుని లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టించి, చర్చను ప్రారంభింపజేస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సమైక్య వాదాన్ని వినిపించటం, పరిస్థితిని బట్టి సమైక్య తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సభలో మంత్రి శైలజానాథ్ ద్వారా బిల్లును ప్రవేశపెడుతూనే… ఇందులో లోపాలున్నాయని, సరైన సమాచారమే లేదని, ఆచరణ సాధ్యం కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వాదనను సీఎం వినిపింపజేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

kiranసీఎం ముందుస్తు వ్యూహాలను పసిగట్టిన తెలంగాణవాదులు ధీటుగా స్పందించేందుకు రెడీ అవుతున్నారు. విభనబిల్లుపై చర్చ జరపడం తప్పించి…సమైక్య తీర్మానాన్ని అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవలే మంత్రి జానారెడ్డి నివాసంలో టీ నేతలు సమావేశమై అసెంబ్లీలో అనుసరించబోయే వ్యూహాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. బిల్లును ఏ రూపంలో వ్యతిరేకించినా సమర్ధంగా ఎదుర్కోవాలని తెలంగాణకి చెందిన మంత్రులు, ఇతర సీనియర్ సభ్యులు నిర్ణయించుకున్నారు. చర్చ ప్రారంభిస్తే సహకరించాలని… ఇతరత్రా ఏ రూపంలో బిల్లును వ్యతిరేకించినా అడ్డుకోవాలని భావిస్తున్నారు.

mఇక బీఏసీ సమావేశంలో అంగీకరించిన విధంగా ప్రతి ఒక్క సభ్యుడు స్వేచ్ఛగా తమ ప్రాంత అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం దక్కనుంది. అయితే బిల్లుకు సవరణలు… ఓటింగ్‌పై మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. టీ నేతలు కేవలం చర్చకే మొగ్గు చూపుతుండగా… సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మాత్రం ఓటింగ్‌కు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని టీఆర్‌ఎస్‌ హెచ్చరిస్తుండగా… బిల్లు అసమగ్రంగా ఉందని టీడీపీ మండిపడుతోంది. కాంగ్రెస్ నేతలు సమైక్య తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తుంటే…వైసీపీ నేతలు అసలు చర్చే జరగకుండా సభను అడ్డుకోవాలని ప్లాన్‌ వేస్తున్నారు.

మొత్తానికి అసెంబ్లీ మలివిడత సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. వాదోపవాదలు, ప్రతిఘటనలు, నిందారోపణలవంటి సీన్‌లు భారీగా ఉండే అవకాశాలున్నాయి. పాకిస్థాన్‌, భారత్‌ వన్డే మ్యాచ్‌ను తలపించే నరాలు తెగే ఉత్కంఠత, ఎత్తుగడలు, వ్యూహప్రతివ్యూహాలతో అసెంబ్లీ సమావేశాలు రక్తికట్టనున్నాయి.